కాయ్ రాజా కాయ్ : లక్షకు 5 లక్షలు

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలలో ఎన్నికల కోలాహలం ముగిసింది. ఫలితాలు జూన్ 4న వెలువడనున్నాయి. దీనికి 20 రోజుల సమయం ఉంది. ఆంధ్రాలో శాసనసభ, లోక్ సభ ఎన్నికల నేపథ్యంలో సర్వత్రా ఉత్కంఠ నెలకొన్నది. టీడీపీ కూటమి అధికారంలోకి వస్తుందా ? వైసీపీ తిరిగి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందా ? ఏ పార్టీకి ఎన్ని సీట్లు వస్తాయి ? ఎవరు గెలుస్తారు ? ఎంత మెజారిటీ వస్తుంది ? అన్న ప్రాతిపదికన బెట్టింగ్ రాయుళ్లు బరిలోకి దిగారు. రూ.కోట్లలో పందాలు మొదలయ్యాయి. రూ.లక్షకు రూ.5 లక్షలు చొప్పున బెట్టింగ్ జరుగుతుండడం విశేషం.

ప్రధానంగా ఆంధ్రాలో అందరిచూపు పవన్ కళ్యాణ్ పోటీ చేసిన పిఠాపురం మీదనే ఉంది. 2019 ఎన్నికలలో గాజువాక, భీమవరంలలో రెండు చోట్లా ఓటమిపాలైన నేపథ్యంలో ఈసారి పిఠాపురం మీద అందరిదృష్టి మళ్లింది. పవన్ కళ్యాణ్ గెలుస్తాడా ? ఎంత మెజారిటీతో గెలుస్తాడు అన్న దాని మీద బెట్టింగ్ జరుగుతుంది. గత ఎన్నికలలో మంగళగిరి నుండి పోటీ చేసిన నారా లోకేష్ ఓటమి పాలయ్యాడు. ఈ నేపథ్యంలో అక్కడ ఈసారైనా గెలుస్తాడా ? గెలిస్తే ఎంత మెజారిటీతో గెలుస్తాడు ? అన్న చర్చ జరుగుతుంది.

ఇక టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు పోటీ చేసిన కుప్పం మీద కూడా బెట్టింగులు జరుగతున్నాయి. ఆఖరు నిమిషంలో టీడీపీ టికెట్ సాధించి పోటీకి దిగిన ఎంపీ రఘురామ కృష్ణంరాజు ఉండి నియోజకవర్గం మీద కూడా బెట్టింగ్ రాయుళ్లు గురిపెట్టారు. ఇక్కడ టీడీపీ రెబెల్ గా మాజీ ఎమ్మెల్యే శివరామరాజు, వైసీపీ అభ్యర్థిగా నరసింహారాజు బరిలో ఉండడంతో ఈ ఫలితం మీద అందరికీ ఆసక్తి పెరిగింది.

భీమవరంలో జనసేన తరపున పులపర్తి రామాంజనేయులు, వైసీపీ నుంచి గ్రంథి శ్రీనివాస్‌ల మధ్య పోటీపై పందాలు నడుస్తున్నాయి. విజయవాడ, నర్సాపుర్ ఎంపీ స్థానాలలో పాటు కడప ఎంపీగా పోటీ చేసిన షర్మిల ఎంత వరకు ప్రభావం చూపుతుంది అన్న చర్చ నడుస్తున్నది. ముఖ్యంగా పవన్ కళ్యాణ్, నారా లోకేష్, బాలక్రిష్ణల మీద వైసీపీ మహిళలను పోటీకి నిలపడంతో అక్కడి ఫలితాలు ఎలా ఉంటాయి ? అసలు జగన్ స్ట్రాటజీ పనిచేస్తుందా ? అని అందరూ ఉత్కంఠగా ఫలితాల కోసం ఎదురుచూస్తున్నారు.