టీడీపీ అధినేత చంద్రబాబుకు.. ప్రధాని మోడీ బిగ్ ఆఫర్ ఇచ్చారు. మోడీ వరుసగా మూడోసారి కూడా.. పరమ పవిత్ర కాశీ నియోజకవర్గం(వారణాసి) నుంచి పోటీ చేస్తున్నారు. దీనికి సంబంధించిన నామినేషన్ కార్యక్రమం మంగళవారం జరిగింది. ఈ నేపథ్యంలో కూటమి పార్టీలకు కూడా ఆయన ఆహ్వానం పంపించారు. దీంతో చంద్రబాబు కూడా అక్కడకు వెళ్లారు. నామినేషన్ కార్యక్రమంలో పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ప్రధాని మోడీని చంద్రబాబు ఘనంగా సత్కరించారు. ఈ సమయంలో మోడీ.. చంద్రబాబుతో సరదాగా మాట్లాడుతూ.. ఏపీలో జరిగిన ఎన్నికల ప్రచారం విషయాన్ని ప్రస్తావించారు. మీరు చాలా కష్టపడ్డారు. ఎండలో కూడా లెక్కచేయకుండా ప్రచారం చేశారు. మీ కష్టం ఫలిస్తుంది.. దీనికి సంబంధించి న ఫలాలను జూన్ 4న మీరు అందుకోబోతున్నారని చెప్పారు. ఇదేసమయంలో ఆయన నా కోసం కూడా ప్రచారం చేస్తారా? అని నవ్వుతూ ప్రశ్నించారు.
వాస్తవానికి మోడీ నోటి నుంచి ఇలాంటి ప్రశ్న వస్తుందని చంద్రబాబు ఊహించలేదు. కానీ.. మోడీ అడిగారు. దీంతో చంద్రబాబు ఒకింత ఆశ్చర్యానికి గురైనా.. నవ్వుతూ ఉండిపోయారు. వాస్తవానికి కూటమి పక్షాల నేతల్లో కీలకమైన వారిని బీజేపీ ప్రచారానికి వాడుకుంటున్న విషయం తెలిసిందే. ఆయా వర్గాల ప్రజలు ఎక్కడ ఉన్నా. కూటమి పార్టీల నేతలను వినియోగించి ప్రచారం చేయిస్తోంది. ఉదాహరణకు తమిళనాడు బీజేపీ నేత అన్నామలై.. కాశీలో తమిళులు ఎక్కువగా ఉన్న చోట ప్రచారం చేస్తున్నారు.
అదేవిధంగా కాశీలో తెలుగు వారు కూడా ఎక్కువగా ఉన్నారు. వీరు కేవలం తీర్థయాత్రలకు మాత్రమే వెళ్లి వచ్చేవారు కాదు.. 5 శాతం జనాభా అక్కడే ఉండి.. వ్యాపారాలు.. పూజలు వంటి క్రతువుల్లో ఉన్నారు. అదేవిధంగా అన్న సత్రాలు నిర్వహిస్తున్నారు. టూరిజం స్పాట్‌గా కూడా అభివృద్ది చెందిన నేపథ్యంలో తెలుగు వారు పెరిగారు. ఈ నేపథ్యంలోనే చంద్రబాబును ప్రచారానికి రమ్మని మోడీ ఆహ్వానించి ఉంటారని భావించవచ్చు. మరి ఆయన వెళ్తారో.. లేదో చూడాలి.