ఏపీ వైసీపీకి పార్టీకి భారీ షాకే తగిలింది. సీఎం జగన్ మాతృమూర్తి విజయమ్మ.. తన కుమార్తె, కాంగ్రెస్ పార్టీ చీఫ్ షర్మిల వైపు నిలబడినట్టు స్పష్టమైంది. కడప ఎంపీగా పోటీ చేస్తున్న షర్మిలకు ఓటేసి గెలిపించాలని ఆమె పిలుపునిచ్చారు. అయితే.. ఈ విషయంపై సీఎం జగన్ ఎలా స్పందిస్తారు? అనేది కీలకంగా మారింది. ఎందుకంటే..ఇప్పటి వరకు కాంగ్రెస్ పార్టీపై ఆయన తీవ్ర విమర్శలే చేస్తున్నారు. తమ కుటుంబాన్ని రోడ్డున పడేసి, తనను జైల్లో పెట్టిన కాంగ్రెస్ పార్టీకి షర్మిల మద్దతు ఇస్తున్నారని.. ఆమెను చంద్రబాబు ఆడిస్తున్నారని తీవ్ర విమర్శలు చేశారు.
అంతేకాదు.. రేవంత్‌రెడ్డి చంద్రబాబు జేబులో మనిషి అని అన్నారు. ఆయన సూచనల మేరకే షర్మిల.. ఏపీలో కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలిగా బాధ్యతలు చేపట్టారని చెప్పారు. ఈ మొత్తం వ్యవహారం కూడా చంద్రబాబు కనుసన్నల్లోనే జరుగుతోందని శుక్రవారం కడపలో పర్యటించిన జగన్ విమర్శలు గుప్పించారు. వైసీపీ ఓటు బ్యాంకును చీల్చి.. తాను లబ్ధి పొందాలన్న చంద్ర బాబు కుట్రల్లో తన చెల్లెళ్లు భాగస్వాములు అయ్యారని చెప్పారు. కాంగ్రెస్‌కు ఓటేస్తే.. టీడీపీకి ఓటేసినట్టేనని జగన్ చెప్పారు. వీరంతా చంద్రబాబు మనుషులేనని అన్నారు. కాంగ్రెస్‌కు ఓటేయొద్దని కూడా చెప్పారు.
కట్ చేస్తే.. ఇప్పుడు అదే కాంగ్రెస్ తరఫున కడప ఎంపీగా పోటీ చేస్తున్న షర్మిలకు మద్దతుగా విజయమ్మ కూడా సెల్ఫీవీడియో విడుదల చేశారు. పోలింగ్‌కు ఒక్క రోజు గ్యాప్‌లో ఆమె స్పందించి సంచలనం రేపారు. ఇప్పటి వరకు ఆమె కుమారుడు జగన్, కుమార్తె షర్మిలవైపు ఉండకపోవడం గమనార్హం. ఇలాంటి సమయంలో ఆమె తటస్థంగా ఉంటారని భావించారు. కానీ, షర్మిలకు మద్దతుగా ఆమె వ్యవహరించడంతోపాటు.. కాంగ్రెస్ గుర్తుకు ఓటేయాలని పిలుపునిచ్చారు. మరి దీనిని జగన్ ఎలా చూస్తారు? ఇప్పటి వరకు షర్మిల, సునీతల వెనుక.. చంద్రబాబు ఉన్నారని చెప్పిన జగన్.. విజయమ్మ వెనుక కూడా చంద్రబాబు ఉన్నారని చెప్పగలరా?
విజయమ్మను కూడా చంద్రబాబు ఆడిస్తున్నారని.. ఆరోపించగలరా? అనేది మిలియన్ డాలర్ల ప్రశ్న. ఇదే నిజమని ఆయన చెబుతారో.. లేక మౌనంగా ఉంటారో చూడాలి. ఏదేమైనా చివరి నిముషంలో విజయమ్మ విడుదల చేసిన వీడియో సందేశం.. కడప ప్రజలపై నే కాకుండా.. రాష్ట్ర వ్యాప్తంగా కూడా.. ప్రభావం చూపించే అవకాశం మెండుగానే ఉండే అవకాశం ఉంది. వైసీపీ ఓటు బ్యాంకును చీల్చినా ఆశ్చర్యం లేదు. ఏదేమైనా.. జగన్ ఇప్పుడు ఒంటరయ్యారనే చర్చ జరుగుతోంది. కాంగ్రెస్ పార్టీ వైపు తన మాతృమూర్తి కూడా నిలబడడం.. షర్మిల ఆ పార్టీకి అద్యక్షురాలిగా ఉండడం వంటివి.. రాజకీయంగా జగన్‌కు ఇబ్బందులు సృష్టించేవే. మరి ఎలా బయట పడతారో.. ఏం చెబుతారో.. చూడాలి.
Gulte Telugu Telugu Political and Movie News Updates