మాజీ మంత్రి, తెలంగాణ నాయకుడు, బీఆర్ఎస్ నేత ఎర్రబెల్లి దయాకర్ రావు.. తాజాగా సంచలన వ్యాఖ్యలు చేశారు. గతంలో తాను టీడీపీలో ఉండగా.. కాంగ్రెస్‌లోకి రావాలంటూ.. అప్పటి సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డి ఒత్తిడి చేశారని చెప్పారు. అంతేకాదు. రూ.100 కోట్లు ఇస్తామని ఆఫర్ కూడా చేశారని, మంత్రి పదవిని కూడా గేలం వేశారని.. అయినా తాను పార్టీ మారలేదని చెప్పుకొచ్చారు. పార్టీ మారలేదన్న కారణంతో వైఎస్ తనపై కక్ష కట్టినట్టు ఎర్రబెల్లి చెప్పుకొచ్చారు. అందుకే వర్ధన్న పేట నియోజకవర్గాన్ని ఎస్సీ కాన్‌స్టిట్యుయెన్సీగా మార్చేశారని ఆరోపించారు.
అయితే.. 2026లో జరిగే నియోజకవర్గాల పునర్ విభజనలో వర్ధన్నపేట నియోజకవర్గం మరోసారి జనరల్ కానుందని ఎర్రబెల్లి చెప్పారు. వర్ధన్న పేట నియోజకవర్గం దయాకర్ రావు అడ్డాగా పేర్కొన్న ఆయన జనరల్ కాగానే తాను అక్కడ నుంచి పోటీ చేసి విజయం దక్కించుకుంటానన్నారు. గత డిసెంబరులో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో తనపై పోటీ మహిళా అభ్యర్థి కన్నీళ్లు పెట్టుకుంటూ ఓట్లు అభ్యర్థించారని.. అందుకే ఆమె గెలిచారని విమర్శించారు. లేకపోతే.. తనదే విజయమని చెప్పుకొచ్చారు. తాను ఏడుసార్లు ఎమ్మెల్యేగా గెలిచానని ఎర్రబెల్లి వ్యాఖ్యానించారు.
కాగా, ప్రస్తుత సీఎం రేవంత్ రెడ్డి తన శిష్యుడేనని ఎర్రబెల్లి వ్యాఖ్యానించారు. రేవంత్ మూడు సార్లే ఎమ్మెల్యే గెలిచిన విషయాన్ని ప్రతి ఒక్కరూ గుర్తు పెట్టుకోవాలన్నారు. సీఎం రేవంత్ తన శిష్యుడే అయినా.. తనకు ఎప్పుడు నిలకడ లేదని అన్నారు. అందుకే చంద్రబాబును తిట్టారని చెప్పారు. తాను కూడా చంద్రబాబు వద్ద పనిచేశానని, కానీ ఎప్పుడు దూషించలేదన్నారు. పార్టీలో సంబంధం ఎలా ఉన్నా.. నాయకులు నిజాయితీగా ఉండాలని సూచించారు. వచ్చే 10 నెలల్లోనే రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయని ఎర్రబెల్లి దయాకర్ అన్నారు. చంద్రబాబును, కేసీఆర్‌ను మోసం చేసిన వారు చాలా మంది ఉన్నారని పలువురి పేర్లు ఈ సందర్భంగా ఆయన చెప్పడం గమనార్హం.