మెగాస్టార్ చిరంజీవి.. రాజకీయాలపై తన మనసులో మాట వెల్లడించారు. పాలిటిక్స్‌కు తాను అతీతంగా ఉంటానని తేల్చి చెప్పారు. అయితే.. సహజంగానే తోడబుట్టిన వాడు కనుక పవన్ కళ్యాణ్ విజయం సాధించాలని కోరుకుంటున్నట్టు తెలిపారు. ఇక, అందరూ.. ఎదురు చూసినట్టు పిఠాపురంలో పవన్ తరఫున ప్రచారానికి చిరు వెళ్తారా? లేదా? అన్న ఉత్కంఠకు కూడా.. చిరంజీవి చెక్ పెట్టారు. తాను పిఠాపురం వెళ్లడం లేదని తేల్చి చెప్పారు.
పవన్ కల్యాణ్ కు కూడా.. తనను పిఠాపురం వచ్చి ప్రచారం చేయాలని కోరుకునే మనస్తత్వం లేదన్నారు. అయితే.. సోదరుడిగా పవన్ కల్యాణ్ మంచిని కోరుకుంటున్నట్టు చెప్పారు. పవన్ ఆశయాలు నెరవేరాలని కోరుకుంటున్నట్టు చిరంజీవి వెల్లడించారు. ఈ మేరకు ఆయన హైదరాబాద్‌లో మీడియాకు వివరించారు. పద్మవిభూషణ్ వంటి ప్రతిష్టాత్మక పురస్కారాన్ని సొంతం చేసుకున్న చిరంజీవి.. ఢిల్లీ నుంచి శక్రవారం తిరిగి వచ్చారు. ఈ సమయంలో విమానాశ్రయం వద్ద ఆయన మీడియాతో మాట్లాడారు.
ఇదిలావుంటే.. రెండు రోజుల కిందట మెగా స్టార్.. ఓ వీడియో సందేశం విడుదల చేసిన విషయం తెలిసిందే. పిఠాపురంలో తన సోదరుడు, జనసేన అధినేత పవన్‌ను ఆయన గెలిపించాలని కోరారు. ఆశయాలు మంచివని.. ఇష్టపడి రాజకీయాల్లోకి వచ్చాడని.. తను గెలవకపోయినా.. ప్రజలకు, పేదలకు అండగా ఉన్నాడని తెలిపారు. అలాంటి గళం.. అసెంబ్లీలో ఉంటే.. మరింతగా పేదలకు న్యాయం జరుగుతుందని చిరు తేల్చి చెప్పిన విషయం తెలిసిందే.
Gulte Telugu Telugu Political and Movie News Updates