అదే .. మా నాన్నకు రేవంత్ ఇచ్చిన గిఫ్ట్

‘కొండ’ను పిండి చేస్తాం. చేవెళ్లలో గెలవనివ్వం అని రేవంత్ రెడ్డి అనడం డ్రామా. కాంగ్రెస్ బతకాలంటే రేవంత్ పీసీసీ చీఫ్ కావాలని సపోర్ట్ చేసింది మా నాన్నగారు. బీఅర్ఎస్ సిట్టింగ్ ఎంపీ రంజిత్ రెడ్డికి కాంగ్రెస్ టికెట్ ఇవ్వడమే మా నాన్న, రేవంత్ రెడ్డిల మధ్య ఉన్న స్నేహానికి నిదర్శనం. మల్కాజ్ గిరిలో నిలబెట్టిన కాంగ్రెస్ అభ్యర్థి సునీతా మహేందర్ రెడ్డిని చేవెళ్లలో పోటీకి దించి ఉంటే టఫ్ ఫైట్ ఉండేది. రంజిత్ రెడ్డికి టికెట్ ఇవ్వడమే రేవంత్ రెడ్డి ఇచ్చిన గిఫ్ట్’ అన్న చేవెళ్ల ఎంపీ అభ్యర్థి కొండా విశ్వేశ్వర్ రెడ్డి కుమారుడు కొండా విశ్వజిత్ చేసిన వ్యాఖ్యలు రాజకీయ దుమారం రేపుతున్నాయి.

తెరవెనక రేవంత్ రెడ్డి బీజేపీ అభ్యర్థులకు పరోక్ష సహకారం అందిస్తున్నారన్న ఆరోపణలకు విశ్వజిత్ వ్యాఖ్యలు బలం చేకూరుస్తున్నాయి. తన తండ్రి కాంగ్రెస్ లో ఉన్నప్పుడు అధిష్టానం మీద వత్తిడి తెచ్చి పీసీసీ చీఫ్ పదవి దక్కేందుక సహకరించినందుకు కృతజ్ఞతగానే చేవెళ్లలో రంజిత్ రెడ్డికి టికెట్ ఇచ్చారని వెల్లడించాడు.

సికింద్రాబాద్ లో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గెలుపు కోసమే రేవంత్ దానం నాగేందర్ ను బరిలోకి దించాడని, అక్కడ దానం కనీసం ప్రచారం చేయడం లేదని, మల్కాజ్ గిరిలో ఈటెల రాజేందర్ గెలుపు కోసమే సునీతా మహేందర్ రెడ్డిని నిలబెట్టారని, కరీంనగర్ లో బండి సంజయ్ గెలుపు కోసం వెలిచాల రాజేందర్ రావును నిలిపారని, వరంగల్ లో కడియం కావ్యను రంగంలోకి దింపడం ఒప్పందంలో భాగమేనని చెబుతున్నారు.

నల్లగొండ, భువనగిరి, పెద్దపల్లి స్థానాల్లో కాంగ్రెస్ గెలిచేలా, మిగతా చోట్ల బీజేపీకి సహకరించేలా చేసుకున్న ఒప్పందంలో భాగంగానే డమ్మా అభ్యర్థులను నిలబెట్టి సహకరిస్తున్నారని చెబుతున్నారు. మరి కాంగ్రెస్, బీజేపీ అంతర్గత రాజకీయ ఒప్పందాలు ఎంత వరకు సఫలం అవుతాయో వేచిచూడాలి.