కూటమిలో వైసీపీకి మింగుపడని రీతిలో కో ఆర్డినేషన్

తెలుగుదేశం, జనసేన మధ్య పొత్తు కుదురకూడదని వైసీపీ ఎంత బలంగా కోరుకుందో తెలిసిందే. కానీ అది జరగలేదు. పైగా ఈ రెండు పార్టీలకు కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేజీ కూడా తోడవడంతో కూటమి బలం ఇంకా పెరిగింది. ఇది వైసీపీలో గుబులు పుట్టిస్తున్న సంకేతాలు కనిపిస్తున్నాయి. బీజేపీ వల్ల ఓట్ల పరంగా జరిగే లాభం కంటే.. ఎన్నికల్లో అధికార పార్టీ అక్రమాలు చేయకుండా అడ్డుకోవడం ద్వారా జరిగే మేలు ఎక్కువని టీడీపీ, జనసేన భావిస్తున్నాయి.

ఈ సంగతిలా ఉంచితే.. పొత్తు కుదురుతున్న సమయంలో జనసేన నాయకులు, కార్యకర్తలు, అభిమానులను రెచ్చగొట్టడానికి వైసీపీ వాళ్లు చేయని ప్రయత్నం లేదు. ఎలాగైనా పొత్తును విచ్ఛిన్నం చేయాలని చూశారు. పొత్తు కుదిరాక కూడా సీట్ల పంపిణీ విషయంలో జనసేనకు అన్యాయం జరిగిందంటూ మొసలి కన్నీరు కారుస్తూ జనసైనికులను ఎగతాళి చేయడం, రెచ్చగొట్టడం లాంటివి గట్టిగా చేశారు. ఈ క్రమంలో జనసైనికులు కొందరు ఆవేశపడడం.. టీడీపీ వాళ్లు వారిని కౌంటర్ చేయడం లాంటి పరిణామాలు జరిగాయి. దీంతో ఇరు పార్టీల కార్యకర్తలు ప్రచారంలో, ఎన్నికల్లో సఖ్యతతో మెలుగుతాయా లేదా అన్న సందేహాలు కలిగాయి.

మరోవైపు బీజేపీని తీవ్రంగా వ్యతిరేకించే టీడీపీ వాళ్లు ఆ పార్టీతో ఎలా వ్యవహరిస్తారో అన్న అనుమానాలు కూడా వ్యక్తమయ్యాయి. ఈ క్రమంలో పొత్తు కుదిరినా మూడు పార్టీల మధ్య ఓటు బదిలీ అనుకున్న స్థాయిలో జరగదని.. ఇది తమకు మేలు చేస్తుందని వైసీపీ శ్రేణులు ఆశించాయి. కానీ ఇటు సోషల్ మీడియాలో, అటు గ్రౌండ్ లెవెల్లో టీడీపీ, జనసేన, బీజేపీ మధ్య గొడవలు, వాగ్వాదాలు కొన్ని రోజుల వరకే సాగాయి.

ఎన్నికలకు మూడు వారాల ముందు నుంచి మొత్తం వ్యవహారం సద్దుమణిగిన పరిస్థితే కనిపిస్తోంది. క్షేత్ర స్థాయిలో మూడు పార్టీల వాళ్లు కలిసి సమన్వయంతో సాగుతున్నారు. సోషల్ మీడియాలో కూడా యుద్ధాలు ఆగిపోయాయి. తమలో తాము కలహించుకుంటే వైసీపీకే మేలు చేసినట్లు అవుతుందని.. అందరి లక్ష్యం జగన్‌ను ఓడించడమే కావాలని మూడు పార్టీల వాళ్లు ఒక లక్ష్యంతో పని చేస్తున్న సంకేతాలు కనిపిస్తున్నాయి. ఇదే ఎన్నికల్లో కూడా ప్రతిఫలించి సమన్వయంతో సాగితే కూటమి కోరుకున్న ఫలితాలు రాబట్టడం తథ్యం.