2014లో తెలుగుదేశంకు మద్దతుగా ప్రచారం చేసి ఆ పార్టీ విజయంలో తన వంతు పాత్ర పోషించాడు జనసేనాని పవన్ కళ్యాణ్. కానీ ఆ తర్వాత టీడీపీతో విభేదించి.. ఆ పార్టీ మీద విమర్శలు చేయడం మొదలుపెట్టారు. 2019 ఎన్నికల్లో ఆ పార్టీకి వ్యతిరేకంగా పోటీ చేశారు. ఐతే ఫలితాలు ప్రతికూలంగా వచ్చాయి. ఇప్పుడు మళ్లీ టీడీపీతో కలిసి పొత్తు పెట్టుకుని ఎన్నికల బరిలో నిలిచారు.
పవన్ టీడీపీతో విభేదించిన సమయంలో ఆ పార్టీ నేతలు కొందరు ఆయనపై తీవ్ర విమర్శలే చేశారు. పవన్ కూడా అంతే ఘాటుగా స్పందించారు. పవన్ వ్యతిరేకించిన నాయకుల్లో దెందులూరు మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ ఒకరు. ప్రభాకర్‌ను పవన్ విమర్శిస్తే.. ప్రభాకర్ సైతం జనసేనానిని గట్టిగా టార్గెట్ చేశారు.
ఈ నేపథ్యంలో ఇప్పుడు పవన్ దెందులూరు వెళ్లి చింతమనేనికి మద్దతుగా ప్రచారం చేయడం ఆసక్తి రేకెత్తించింది. గతంలో తమ మధ్య నెలకొన్న గొడవను కూడా ప్రస్తావిస్తూ.. ప్రేమున్న చోటే గొడవ ఉంటుందని, తమది అందమైన గొడవ అని జనసేనాని వ్యాఖ్యానించడం విశేషం. ఈ వీడియో సోషల్ మీడియాలో బాగా వైరల్ అయింది. “నాకు బాగా ఇష్టమైన నాయకుడు. గొడవ పెట్టుకునే నాయకుడీయన. ఎవరు స్నేహితులవుతారు. గొడవ పెట్టుకునేవాళ్లే స్నేహితులవుతారు. పవన్ కళ్యాణ్ పోటీ చేస్తానంటే దెందులూరు నుంచి నేను గెలిపిస్తాను అన్న చింతమనేని గారికి మనస్ఫూర్తిగా నమస్కారాలు. ఆయనతో గొడవ పెట్టుకోవడం కూడా అందంగానే ఉంటుంది నాకు. ప్రేమున్న చోటే గొడవుంటుంది. ఏమంటారు ప్రభాకర్ గారు? మా ఇద్దరికీ ఆ సామరస్యం కుదిరింది. గొడవతో మొదలైన మైత్రి చాలా బలంగా ఉంటుందని అంటారు. చింతమనేని గారికి నా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు చెబుతూ ఆయన్ని గెలిపించాలని కోరుకుంటున్నా” అని పవన్ అనడంతో దెందులూరు జనాల్లో హర్షాతిరేకాలు వ్యక్తమయ్యాయి.
Gulte Telugu Telugu Political and Movie News Updates