జ‌గ‌న్ ఫారిన్ టూర్‌కు అనుమ‌తి ఇవ్వొద్దు: సీబీఐ

ఏపీ సీఎం జ‌గ‌న్ ఈ నెల 17 నుంచి విదేశాల‌కు వెళ్లాల‌ని నిర్ణ‌యించుకున్న విష‌యం తెలిసిందే. అయితే.. ఆయ‌న ప్ర‌స్తుతం బెయిల్‌పై ఉండ‌డంతో దీనికి కోర్టు నుంచి అనుమ‌తి రావాల్సి ఉంది. ఈ క్ర‌మంలోనే సీఎం జ‌గ‌న్ త‌ర‌ఫున న్యాయ‌వాదులు గుట్టు చ‌ప్పుడు కాకుండా ఈ నెల 6వ తేదీనే.. హైద‌రాబాద్ లోని సీబీఐ కోర్టులో విదేశాల‌కు వెళ్లేందుకు అనుమ‌తి కోరుతూ పిటిష‌న్ దాఖ‌లు చేశారు. దీనిపై గురువారం సీబీఐ కోర్టులో విచార‌ణ జ‌రిగింది.

సీబీఐ త‌ర‌ఫున వాద‌న‌లు వినిపించిన న్యాయ‌వాదులు.. ప్ర‌స్తుతం జ‌గ‌న్ పై న‌మోదైన కేసుల విచార‌ణ శ‌ర వేగంగా జ‌రుగుతోంద‌ని తెలిపారు. ఈ ద‌శ‌లో ఆయ‌న‌ను విదేశాల‌కు అనుమ‌తి ఇస్తే.. కేసుల విచార‌ణ మంద‌గించే అవ‌కాశం ఉంద‌ని పేర్కొన్నారు. ఈ నేప‌థ్యంలో జ‌గ‌న్‌కు విదేశాల‌కు వెళ్లేందుకు అనుమ‌తి ఇవ్వొద్ద‌ని కోర్టును అభ్య‌ర్థించారు. ఈ మేర‌కు సీబీఐ వేసిన కౌంట‌ర్‌లో ప‌లు విష‌యాలు వెల్ల‌డించ‌డం విశేషం. జ‌గ‌న్‌ను విదేశాల‌కు అనుమ‌తించేందుకు తాము వ్య‌తిరేక‌మ‌ని సీబీఐ స్ప‌ష్టం చేసింది.

ఇక‌, సీఎం జ‌గ‌న్ త‌ర‌ఫు న్యాయ‌వాదులు మాత్రం.. గ‌త ఏడాది న‌వంబ‌రులో అనుమ‌తించార‌ని.. అప్ప‌ట్లో నూ.. ఆయ‌న విదేశాల‌కు వెళ్లి.. ఎలాంటి ఇబ్బందులూ క‌లిగించ‌కుండానే తిరిగి వ‌చ్చార‌ని తెలిపారు. ప్ర‌స్తుతం ఆయ‌న కుమార్తెలు బ్రిట‌న్‌లో చ‌దువుతున్నార‌ని.. అదేవిధంగా జెరూస‌లేం వెళ్లి ప్రార్థ‌న‌ల్లో పాల్గొనాల్సి ఉంద‌ని కాబ‌ట్టి.. విదేశీ ప‌ర్య‌ట‌న‌ల‌కు అనుమ‌తి ఇవ్వాల‌ని కేసుల విచార‌ణ‌కు ఎలాంటి అడ్డంకులు ఉండ‌బోవ‌ని తెలిపారు.

ఇరు ప‌క్షాల వాద‌న‌లు విన్న కోర్టు.. తీర్పును ఈ నెల 14కు వాయిదా వేసింది. మ‌రి ఎలాంటి తీర్పు ఇస్తుందో చూడాలి. జ‌గ‌న్ పేర్కొన్న షెడ్యూల్ ప్ర‌కారం ఆయ‌న ఈ నెల 17న విదేశాల‌కు(బ్రిట‌న్‌, ఫ్రాన్స్‌, స్విట్జ‌ర్లాండ్‌) వెళ్ల‌నున్నారు. వ‌చ్చే నెల 1న తిరిగి రాష్ట్రానికి రానున్నారు. కాగా, ఈ నెల 13న రాష్ట్రంలో ఎన్నిక‌లు జ‌ర‌గ‌నున్నాయి. వ‌చ్చే నెల 4న ఫ‌లితం రానుంది.