ఏపీ ప్రభుత్వానికి కేంద్ర ఎన్నికల సంఘం భారీ షాక్ ఇచ్చింది. ముఖ్యంగా జగన్ ప్రబుత్వం అమలు చేస్తున్న పథకాలను ఎన్నికల సమయంలో ప్రస్తావించడానికి వీల్లేదని తాజాగా ఆదేశాలు ఇచ్చింది. దీంతో ఏపీ అధికార పార్టీ వైసీపీకి చేతులు కాళ్లు కట్టేసి నట్టు అయింది. ప్రస్తుతం అమలు చేస్తున్న పథకాలను ప్రస్తావించరాదని తేల్చి చెప్పింది. అదేవిధంగా ఒక్క రూపాయి నిధులు కూడా ఇవ్వడానికి వీల్లేదని ఎన్నికల సంఘం తేల్చి చెప్పింది. ఈ మేరకు ప్రభుత్వం పెట్టుకున్న అర్జీని బుట్టదాఖలు చేసింది.
ఏం జరిగింది?
ఏపీలో జగన్ ప్రభుత్వం పలు సంక్షేమ పథకాలను 2019 నుంచి అమలు చేస్తున్న విషయం తెలిసిందే. వీటిలో కాలానుగుణంగా అమలు చేసే కార్యక్రమం వైఎస్సార్ రైతు భరోసా, అమ్మ ఒడి వంటివి. మే మొదటి లేదా రెండో వారంలో రైతులు దుక్కుతున్నారు కాబట్టి వారికి పెట్టుబడి సాయం కింద జగన్ ప్రభుత్వం రూ.6000 ఇస్తోంది. నవంబరు నాటికి మరో రూ.7300 ఇస్తోంది. దీనిలో కేంద్ర సాయం 2000 చొప్పున ఉంటుంది. ఇప్పుడుమే రెండో వారం ప్రారంభం అవుతున్న నేపథ్యంలో రైతులకు ఇన్ పుట్ సబ్సిడీ కింద.. సాయం చేయాలని ప్రభుత్వం చూసింది. అయితే.. ఈ విషయాన్ని గమనించిన టీడీపీ.. ఇప్పటికే.. కేంద్ర ఎన్నికల సంఘానికి పథకాల పేరుతో జగన్ మోసం చేస్తున్నారంటూ లేఖ రాసింది.
ఇది జరిగిన రెండు రోజులకు కళ్లు తెరిచిన ప్రబుత్వం రైతులకు ఏటా ఇస్తున్నట్టుగానే ఇప్పుడు కూడా ఇన్ పుట్ సాయం కింద రూ.6000 ఇచ్చేందుకు అనుమతి ఇవ్వాలని కోరుతూ.. కేంద్ర ఎన్నికల సంఘానికి లేఖ రాశారు. అయితే.. అప్పటికే టీడీపీ ఇచ్చిన లేఖను పరిగణనలోకి తీసుకున్న ఈసీ..ఏ పథకానికీ నిధులు విడుదల చేయడానికి వీల్లేదని తేల్చి చెప్పింది. అయితే.. వైసీపీ మరో లేఖ రాసింది. ఇప్పటికే కొనసాగుతున్న పథకమని.. గత నాలుగేళ్లుగా అమల్లోఉందని తెలిపింది. అయినప్పటికీ.. ఇవ్వడానికి వీల్లేదని.. ఈసీ షరతులు విధించింది.
అంతేకాదు.. ఈ విషయాన్ని ప్రచారంలో వాడుకోవడానికి కూడా వీల్లేదని తేల్చి చెప్పింది. దీంతో త్వరలో ఇవ్వల్సిన అంటే.. జూన్ 1, 2 తారీకుల్లో ఇవ్వాల్సిన అమ్మ ఒడికి కూడా.. ఈసీ అనుమతి ఇవ్వలేదు. మరి జగన్ ఏం చేస్తారో చూడాలి. గతంలో చంద్రబాబు అధికారంలో ఉన్నప్పుడు కూడా.. పసుపు-కుంకుమ పథకానికి ఇబ్బంది వచ్చినప్పుడు హైకోర్టుకు వెళ్లి అనుమతి తెచ్చుకున్నారు. ఇప్పుడు జగన్ సర్కారు కూడా అలా చేస్తుందా ? లేదా.. అనేది చూడాలి.