ప‌వ‌న్‌కు రిలీఫ్… చంద్ర‌బాబుకు తిప్పలు!

జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ల్యాణ్‌కు  ఎన్నిక‌ల గుర్తుల కేటాయింపు విష‌యంలో కొంత రిలీఫ్ ద‌క్కింది. కానీ, ఇదేస‌మ‌యంలో కూట‌మి పార్టీల అధినేత చంద్ర‌బాబుకు మాత్రం తిప్ప‌లు త‌ప్పేలా క‌నిపించ‌డం లేదు. దీనికి కార‌ణం.. స్వతంత్ర అభ్య‌ర్థుల‌కు కేటాయించిన గ్లాసు గుర్తును వెన‌క్కి తీసుకునేది లేద‌ని ఎన్నికల సంఘం తేల్చి చెప్పింది. ప్ర‌స్తుత సార్వ‌త్రిక ఎన్నిక‌ల స‌మ‌యంలో గుర్తింపు పొంద‌న పార్టీగా ఉన్న జ‌న‌సేన‌కు కేంద్ర ఎన్నిక‌ల సంఘం గాజు గ్లాసు గుర్తును ఇచ్చింది.

అయితే.. దీనినే చాలా మంది స్వ‌తంత్రులు కూడా కోరుకున్నారు. దీంతో జ‌న‌సేన పోటీలో లేని 18 అసెంబ్లీ నియోజ‌క‌వ‌ర్గాల్లో ఆయా అభ్య‌ర్థుల‌కు కేంద్ర ఎన్నికల సంఘం గాజు గ్లాసును ఇచ్చింది. అదేవిధంగా రెండు పార్ల‌మెంటు స్థానాలైన మ‌చిలీప‌ట్నం, కాకినాడ‌లోనూ స్వ‌తంత్రుల‌కు ఇదే గుర్తు కేటాయించింది. అయితే.. ఇది త‌మ‌కు ఇబ్బంది అని.. త‌మ గుర్తును వేరేవారికి ఇవ్వ‌రాద‌ని కోరుతూ.. జ‌న‌సేన హైకోర్టును ఆశ్ర‌యించింది. దీనిపై కేంద్ర ఎన్నిక‌ల సంఘం తాజాగా అపిడ‌విట్ దాఖ‌లు చేసింది.

దీనిలో జ‌న‌సేన పోటీ చేస్తున్న అన్ని నియోజ‌క‌వ‌ర్గాల్లోనూ ఆ పార్టీ కి మాత్ర‌మే గాజు గ్లాసు గుర్తును కేటాయిస్తామ‌ని.. మిగిలిన వారికి కేటాయించ‌బోమ‌ని స్ప‌ష్టం చేసింది. ఈ క్ర‌మంలో ఇప్ప‌టికే రెండు పార్ల‌మెంటు స్థానాల్లో ఇత‌రుల‌కు కేటాయించిన గాజు గ్లాసు గుర్తును వెన‌క్కి తీసుకుంది. ఇది కొంత వ‌ర‌కు ప‌వ‌న్‌కు రిలీఫ్ ఇచ్చే అవ‌కాశ‌మే. అయితే.. ఇత‌ర అసెంబ్లీ నియోజ‌క‌వ‌ర్గాల విష‌యానికి వ‌స్తే మాత్రం.. ఈ ప‌రిస్థితి లేదు. అక్క‌డ గాజు గ్లాసు గుర్తును వెన‌క్కి తీసుకునేది లేద‌ని పేర్కొంది. ఈ ప‌రిణామం కూట‌మి ప్ర‌ధాన పార్టీ టీడీపీకి తిప్పలు పెట్ట‌డం ఖాయ‌మ‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు. మ‌రి దీనిపై తుది తీర్పు ఎలా వ‌స్తుందో చూడాలి.