టీడీపీ, జనసేన మేనిఫెస్టోను ఈ రోజు టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన అధినేత పవన్ కల్యాణ్, బీజేపీ నేత సిద్ధార్థ్ నాథ్ సింగ్ సంయుక్తంగా విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే మేనిఫెస్టోపై పవన్ కల్యాణ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. యువగళం, జనగళంలో వచ్చిన వినతులు, బీజేపే సలహాలు, సూచనలు క్రోఢీకరించి ఈ మేనిఫెస్టోను విడుదల చేశామని పవన్ అన్నారు. 3 పార్టీలకు వచ్చిన వినతులతో మేనిఫెస్టో రూపొందించామని పవన్ కళ్యాణ్ అన్నారు. ప్రజల అవసరాలు, ఆకాంక్షలకు అనుగుణంగా మేనిఫెస్టోను రూపొందించామని చెప్పారు. సూపర్ సిక్స్, షణ్ముఖ వ్యూహం, బీజేపీ సూచనలు కలగలిపి ఈ మేనిఫెస్టో తయారు చేశామని అన్నారు.
కత్తి మన మీద ఏపీ భవిష్యత్తు వేలాడుతోందని, ఐదేళ్లుగా రాష్ట్రంలో అశాంతి, అరాచకమే ఉందని అన్నారు. 10 రూపాయలు ఇచ్చిన వైసీపీ 1000 కొల్లగొడుతోందని ఆరోపించారు. అన్నా క్యాంటీన్లతో పాటు టీడీపీ తెచ్చిన 100 సంక్షేమ పథకాలు రద్దు చేశారని, పోలవరం ప్రాజెక్టు పూర్తి కాలేదని, నదుల అనుసంధానాన్ని గోదాట్లో ముంచారని మండిపడ్డారు. ప్రపంచంలో అత్యంత శక్తివంతమైన తెలుగు జాతి…ఏపీని చూసి ఆవేదన వ్యక్తం చేస్తోందని చెప్పారు. 13 లక్షల కోట్లు అప్పు చేసి ఆర్థిక వ్యవస్థ పతనం చేసిన జగన్ ప్రతి కుటుంబంపై రూ. 8 లక్షల అప్పు భారం మోపారని దుయ్యబట్టారు.
రాష్ట్రంలో పట్టభద్రుల నిరుద్యోగం 24 శాతం ఉందని అన్నారు. సంపద సృష్టించే ప్రజా రాజధాని అమరావతిని విధ్వంసం చేశారని మండిపడ్డారు. ఇక, ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పేరుతో లక్షలాది ఎకరాల ప్రజల ఆస్తిని కొల్లగొడుతున్నారని ఆరోపించారు. అన్ని వర్గాలను నాశనం చేశారని, ప్రశ్నించిన ప్రతిపక్ష నేతలు 600 మందిని హత్య చేశారని ఆరోపించారు. వివేకా హంతకులను కాపాడుతున్నారని ఆరోపణలు చేశారు.
విధ్వంస పాలన సాగనంపాలని, స్వర్ణాంధ్రను నిర్మించేందుకు కూటమి అభ్యర్థులకు ఓటు వేసి గెలిపించాలని ప్రజలకు పవన్ పిలుపునిచ్చారు.
Gulte Telugu Telugu Political and Movie News Updates