అధ్యక్షుడిగా నియమితుడైన దగ్గర నుండి రెండు నెలలు హ్యాపీగానే గడిపేసిన సోమువీర్రాజుకు అప్పుడే తలనొప్పులు మొదలయ్యయా ? పార్టీ వర్గాల ప్రకారం అవుననే సమాధానం వినిపిస్తోంది. రాష్ట్ర కార్యవర్గాన్ని ఏర్పాటు చేయటమే తలనొప్పులకు ప్రధాన కారణమని అంటున్నారు. వీర్రాజు ఏర్పాటు చేసిన 40 మందితో కార్యవర్గంలో 10 మంది ఉపాధ్యక్షులు, పదిమంది కార్యదర్శులు, 5 మంది ప్రధాన కార్యదర్శులు కీలకంగా ఉన్నారు. అయితే ఆ పోస్టుల్లోకి అధ్యక్షుడు ఎంపిక చేసిన నేతలపైనే పార్టీలో చాలామంది మండిపోతున్నారట.
పార్టీలో మొదటినుండి కష్టపడుతున్న, విధేయులుగా ఉంటున్న వారిలో చాలామందికి కొత్త కార్యవర్గంలో చోటు దక్కకపోవటమే అసంతృప్తికి ప్రధాన కారణంగా సమాచారం. గతంలో సుమారు రెండువందలమందితో పార్టీ కార్యవర్గం ఉండేది. దాంతో పోల్చుకుంటే ఇపుడు ఏర్పాటు చేసిన 40 మంది కార్యవర్గంతో చాలామంది హ్యాపీగానే ఉన్నారు. కానీ వివిధ పదవుల్లో నియమితులైన 40 మందిలో పార్టీలో మొదటినుండి పని చేస్తున్న నేతలకు చోటు దక్కలేదన్నదే అసలు సమస్యగా మారింది.
ఇప్పటికే ఎంఎల్సీగా ఉన్న మాధవ్, నెహ్రు యువకేంద్రంలో కీలక పదవిలో ఉన్న విష్ణువర్ధన్ రెడ్డిలను ప్రధాన కార్యదర్శులుగా ఎంపిక చేసిన విషయంలో చాలా మంది మండిపోతున్నారు. ఇప్పటికే పదవుల్లో ఉన్న వారినే కార్యవర్గంలోకి తీసుకునే బదులు మరో ఇద్దరు సీనియర్లను తీసుకుని ఉండచ్చు కదా అనే లాజిక్ కు వీర్రాజు ఏమని సమాధానం చెబుతారో చూడాలి. మొన్నటి వరకు అధ్యక్షునిగా పనిచేసిన కన్నా లక్ష్మీనారాయణ మద్దతుదారులకు కార్యవర్గంలో చోటు దక్కలేదనే ఆరోపణలు కూడా వినబడుతున్నాయి.
మొత్తంమీద చూసుకుంటే కొత్తగా ఏర్పాటైన కార్యవర్గంలో చాలామందికి జనాల్లో ఏమాత్రం పలుకుబడి లేదన్న విషయాన్ని పార్టీ సీనియర్లే అంగీకరిస్తున్నారు. ఆమాటకొస్తే కార్యవర్గంలోని వాళ్ళే కాదు అసలు పార్టి మొత్తం మీద జనాల్లో బలమున్న నేతల సంఖ్య వేళ్ళమీద లెక్కబెట్టాల్సిందే. ఎందుకంటే 2019 ఎన్నికల్లో 175 అసెంబ్లీ, 25 లోక్ సభ స్ధానాల్లో నిలబెట్టటానికి బిజెపికి గట్టి అభ్యర్ధులే కరువయ్యారు.
మొన్నటి ఎన్నికల్లో బిజెపికి వచ్చిన ఓట్లు 0.84 శాతం అంటేనే పార్టీ ఎంత పటిష్టంగా ఉందో అర్ధమైపోతోంది. ఏదో కేంద్రంలో అధికారంలో ఉందన్న కారణంతో రాష్ట్రంలో ఎగిరెగిరి పడటమే కానీ జనాల్లో పార్టీకి బలమే లేదన్న విషయం అందరికీ తెలిసిందే. సరే ఈ విషయాలు అందరికీ తెలిసినా కార్యవర్గ కూర్పుపై వీర్రాజుకు అప్పుడే తలనొప్పులు మొదలైనట్లు ప్రచారం పెరిగిపోతోంది. చూడాలి మరి ఈ సమస్యను వీర్రాజు ఎలా ఎదుర్కొంటారో ?