రాజకీయంగా తనకు ప్రధాన ప్రత్యర్థి నారా చంద్రబాబు నాయుడే అయినప్పటికీ.. వైఎస్ జగన్ దృష్టి ఎక్కువగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మీదే ఉంటుందన్నది వాస్తవం. 2014లో విజయం ఖాయమనుకున్న తనకు ఓటమి ఎదురవడానికి బాబుకు పవన్ ఇచ్చిన మద్దతే కారణమని జగన్ భావిస్తారు. అందుకే పవన్‌ను విమర్శినంత దారుణంగా చంద్రబాబును కూడా టార్గెట్ చేయరంటే అతిశయోక్తి కాదు. ప్రతి మీటింగ్‌లోనూ దత్త పుత్రుడు అని, ప్యాకేజ్ స్టార్ అని, నాలుగు పెళ్లిళ్లు చేసుకున్నాడని.. ఇలా తీవ్రమైన పదజాలంతో వ్యక్తిగత విమర్శలు చేస్తుంటాడు పవన్‌ను ఉద్దేశించి జగన్. అలాగే పవన్‌ను ఎన్నికల్లో ఓడించడానికి ఆయన ప్రతిసారీ గత పర్యాయం గట్టిగా ప్రయత్నించి విజయవంతం అయ్యారు. ఈసారి కూడా పవన్‌ను ఓడించడానికి జగన్ అండ్ కో గట్టి ప్రణాళికలే సిద్ధం చేసినట్లు కనిపిస్తోంది.
వంగా గీత లాంటి బలమైన క్యాండిడేట్‌ను పిఠాపురం బరిలో నిలిచేలా చేయడమే కాదు.. ముద్రగడ పద్మనాభం, ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి, మిథున్ రెడ్డి లాంటి బలమైన నేతలకు ఆ నియోజకవర్గ బాధ్యతలు అప్పగించారు జగన్. అంతే కాక పవన్‌ను దెబ్బ కొట్టడానికి వైసీపీ ఇంకో ప్రణాళిక కూడా రచించినట్లు ప్రచారం జరుగుతోంది. పవన్ కళ్యాణ్ పేరుతో ఇద్దరు అభ్యర్థులను ఎంచుకుని వారికి గాజు గ్లాసు తరహా గుర్తులే వచ్చేలా చూసుకుని పిఠాపురం ఎన్నికల బరిలో నిలిపారని సోషల్ మీడియా జనాలు అంటున్నారు.. అందులో ఒక అభ్యర్థి పేరు కోనేటి పవన్ కళ్యాణ్ కాగా.. మరో అభ్యర్థి పేరు కనుమూరి పవన్ కళ్యాణ్. వీరిలో ఒకరి గుర్తు బకెట్. అది గాజు గ్లాసుకు చాలా దగ్గరగా ఉంది. మరో అభ్యర్థి గుర్తు కూడా గాజు గ్లాసుకు దగ్గరగానే ఉంది. దీనికి సంబంధించి బ్యాలెట్ పేపర్ ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
ఇవి చూసి జనాలను కన్ఫ్యూజ్ చేయడం ద్వారా పవన్‌ను ఓడించడానికి వైసీపీ ఇంతకు దిగజారాలా అని నెటిజన్లు విమర్శలు గుప్పిస్తున్నారు. కానీ ఇది ఉత్త ప్రచారమే అని.. వాస్తవంగా పవన్ కళ్యాణ్ పేరుతో ఒక్కరే నామినేషన్ వేశారన్న వాదన కూడా వినిపిస్తోంది. ఇందులో ఏది నిజమో మరి.
Gulte Telugu Telugu Political and Movie News Updates