ప‌ల‌చ‌నైపోతాం.. చుల‌క‌నైపోతాం.. కేటీఆర్‌లో ఎంత మార్పు!

తెలంగాణ‌లో బీఆర్ఎస్ అధికారంలో ఉన్న‌ప్పుడు ఐటీ శాఖ మంత్రిగా కేటీఆర్ జోరు ప్ర‌దర్శించారు. విదేశీ ప‌ర్య‌ట‌న‌లు, కార్పొరేట్ సంస్థ‌ల‌తో మీటింగ్‌ల‌తో బిజీగా ఉండేవారు. అలాగే బీఆర్ఎస్ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్‌గానూ పార్టీ కార్య‌క్ర‌మాల్లో యాక్టివ్‌గా ఉండేవారు. ప్ర‌త్య‌ర్థి పార్టీల విమ‌ర్శ‌ల‌కు, ఆరోప‌ణ‌ల‌కు త‌న‌దైన స్టైల్లో దూకుడుగా రిప్లే ఇచ్చేవారు. కానీ కాలం ఎప్పుడూ ఒకేలా ఉండ‌దు క‌దా. రాజ‌కీయాల్లో ఓడ‌లు బ‌డ్ల‌వ‌డం కామ‌నే. ఇప్పుడు తెలంగాణ‌లో బీఆర్ఎస్ అధికారంలో లేదు. ప్ర‌తిప‌క్షంలో కూర్చుంది. ఈ నేప‌థ్యంలో కేటీఆర్ మాటల్లోనూ తేడా స్ప‌ష్టంగా తెలుస్తోంద‌న్న అభిప్రాయాలు వ్యక్త‌మ‌వుతున్నాయి.

అధికారాన్ని అడ్డుపెడ్డుకుని తండ్రీకొడుకులు కేసీఆర్‌, కేటీఆర్ వ్య‌వ‌స్థ‌ల‌ను వాడుకున్నార‌నే ఆరోప‌ణ‌లున్నాయి. త‌మ‌ను ప్ర‌శ్నించేవాళ్లే లేర‌ని ఇష్టమొచ్చినట్లు ప్ర‌వ‌ర్తించార‌నే విమ‌ర్శ‌లున్నాయి. కానీ ఇప్పుడు అధికారంలో లేక‌పోయే స‌రికి కేటీఆర్‌కు వాస్త‌వం బోధ‌ప‌డిన‌ట్లుంది. అందుకే తెలంగాణ అసెంబ్లీ ఎన్నిక‌ల్లో ఓడిపోవ‌డం వ‌ల్ల తాము ఫోన్ చేసినా అధికారులు, పోలీసులు స్పందించ‌డం లేద‌ని కేసీఆర్ వ్యాఖ్యానించారు. లోక్‌స‌భ ఎన్నిక‌ల్లో గెల‌వ‌క‌పోతే మ‌రింత ప‌ల‌చ‌నైపోతామ‌ని ఆవేద‌న వ్య‌క్తం చేశారు. రాష్ట్రంలో 12 ఎంపీ సీట్లు సాధిస్తే కేసీఆర్ మ‌రో ఏడాదిలోపే రాష్ట్ర రాజ‌కీయాల‌ను శాసించే స్థాయిలో కీల‌క పాత్ర పోషిస్తార‌ని కేటీఆర్ పేర్కొన్నారు.

కానీ ప్ర‌స్తుతం తెలంగాణ‌లో వాస్త‌వ ప‌రిస్థితి చూస్తే బీఆర్ఎస్‌కు 12 కాదు క‌దా 2 లోక్‌స‌భ సీట్లు కూడా వ‌చ్చే అవ‌కాశం లేద‌న్న‌ది విశ్లేష‌కుల అంచ‌నా. ఈ లోక్‌స‌భ ఎన్నిక‌ల్లో తెలంగాణ‌లో ప్ర‌ధాన పోటీ కాంగ్రెస్‌, బీజేపీ మ‌ధ్య న‌డుస్తోంది. ఈ రెండు పార్టీలే మెజారిటీ స్థానాల‌ను సొంతం చేసుకునే ఆస్కార‌ముంది. అవి పోగా బీఆర్ఎస్‌కు రెండు ద‌క్కినా గొప్పే అనే అభిప్రాయాలు వ్య‌క్త‌మ‌వుతున్నాయి. ఇది తెలిసే బీఆర్ఎస్ ఉనికిని కాపాడుకునేందుకు కేటీఆర్ ఉద్వేగ‌భ‌రితంగా ప్ర‌సంగిస్తున్నార‌నే టాక్ వినిపిస్తోంది.