మొత్తానికి జనసేన అభిమానులు ఎదురు చూస్తున్న కార్యం పూర్తయింది. జనసేనాని పవన్ కళ్యాణ్ పిఠాపురం నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యే అభ్యర్థిగా నామినేషన్ వేశారు. ఇది నామినేషన్ ర్యాలీనా.. విజయోత్సవ వేడుకా అన్న తరహాలో కిలోమీటర్ల కొద్దీ జనం, వాహనాలతో నిండిపోయి కన్నుల పండువగా సాగింది ఈ కార్యక్రమం. పవన్ పిఠాపురాన్ని ఎంచుకోవడానికి ముందు ఈ నియోజకవర్గ టీడీపీ అభ్యర్థిగా ఉండి, పవన్ కూటమి అభ్యర్థిగా ఈ నియోజకవర్గాన్ని ఎంచుకున్నాక కొన్ని రోజులు నిరసన స్వరం వినిపించి, ఆ తర్వాత తీరు మార్చుకున్న వర్మ.. జనసేనాని పక్కనే ఉండి నామినేషన్ వేయించడం విశేషం. హైదరాబాద్ నుంచి పవన్‌ను అభిమానించే సినీ ప్రముఖులు, అభిమానులు కూడా పిఠాపురానికి వెళ్లి ఈ కార్యక్రమంలో పాల్గొనడం విశేషం.
ఇదిలా ఉంటే.. పవన్ అఫిడవిట్ అందరిలోనూ ఆసక్తి రేకెత్తించింది. ఇందులో పవన్ రూ.46 కోట్ల అప్పులు చూపించడం గమనార్హం. తాను వ్యక్తిగతంగా కొందరు వ్యక్తుల నుంచి తీసుకున్న అప్పులను పవన్ ‘పర్సనల్ లోన్’ రూపంలో ఇందులో పొందుపరిచారు. అందులో పవన్ వదినమ్మ, చిరంజీవి భార్య కొణిదెల సురేఖ పేరు ఉండడం.. ఆమె నుంచి పవన్ రూ.2 కోట్ల అప్పు తీసుకున్నట్లు పేర్కొనడం విశేషం.
అంతే కాక ఇంకో 14 మంది నుంచి ఇలా పర్సనల్ లోన్ తీసుకున్నట్లు పవన్ పేర్కొన్నాడు. అందులో పలువురు నిర్మాతలు కూడా ఉన్నారు. త్రివిక్రమ్‌కు హోం బేనర్‌లా మారిన హారిక హాసిని క్రియేషన్స్ నుంచి పవన్ రూ.6.35 కోట్లు తీసుకున్నాడట. ఈ సంస్థలో పవన్ ‘అజ్ఞాతవాసి’ చేసిన సంగతి తెలిసిందే. అలాగే ‘ఉస్తాద్ భగత్ సింగ్’ చేస్తున్న మైత్రీ సంస్థ నుంచి రూ.3 కోట్లు తీసుకున్నాడట పవన్. ఆ సంస్థ అధినేతల్లో ఒకరైన నవీన్ ఎర్నేని నుంచి ప్రత్యేకంగా రూ.5.5 కోట్లు తీసుకున్నట్లు పేర్కొన్నాడు.‘ఓజీ’ని ప్రొడ్యూస్ చేస్తున్న డీవీవీ ఎంటర్టైన్మెంట్స్ పవన్‌కు రూ.10 లక్షలు ఇచ్చింది.