ఏపిలో విచిత్రం.. వేతనాలకు డబ్బుల్లేవ్, పథకాలకు కొదవ లేదు

అసలే లోటు బడ్జెట్. ఆపై కేంద్రం నుంచి ఏమాత్రం సహకారం లేదు. మరి పరిస్థితి ఎలా ఉంటుంది? పైసా పైసాకూ వెతుక్కునే పరిస్థితి. ఇలాంటి పరిస్థితిలో ప్రాణాంతక వైరస్ కరోనా ఎంట్రీతో ఏపీతో పాటు మొత్తం దేశమంతా లాక్ డౌన్. ఉన్న రాబడి భారీగా తగ్గితే… అంతోఇంతో ఆదుకుంటుందనుకున్న కేంద్రానికి రాబడి తగ్గిపోయింది.

ఫలితంగా సంక్షేమ పథకాలకు నిధుల లోటు ఓ రేంజిలో పెరిగిపోయింది. ఉద్యోగులకు సరిగ్గా జీతాలివ్వలేని పరిస్థితి. ఈ తరహా పరిస్థితితో దేశంలోని అన్ని రాష్ట్రాలు కిందామీదా పడిపోతున్నాయి. అయితే ఏపీలో ఈ తరహా పరిస్థితి లేదు. పనిచేసే ఉద్యోగులకు సగానికి సగం వేతనాలను ఆపేసిన జగన్ సర్కారు… సంక్షేమ పథకాలకు మాత్రం ఏ లోటూ రాకుండా చూసుకుుటోంది. అంతేనా… ఉద్యోగులకు సరిగ్గా జీతాలివ్వలేని పరిస్థితుల్లో ఏకంగా సున్నా వడ్డీ పేరిట కొత్త పథకాలను కూడా లాంచ్ చేసేసింది.

ఈ పరిస్థితి నిజంగానే ఆసక్తి రేకెత్తించేదే. ఎందుకంటే… ఏ సర్కారు అయినా, ఏ పరిశ్రమ అయినా… తన వద్ద పనిచేస్తున్న ఉద్యోగులకు పూర్తి వేతనాలు ఇచ్చిన తర్వాత మిగిలిన దానిలో నుంచే సంక్షేమ పథకాలను ప్రవేశపెడతాయి. అమలు చేస్తాయి కూడా. అయితే అందుకు విరుద్ధంగా కరోనా వేళ రాబడి అంతా తగ్గిపోతే… ఆ కారణాన్ని చూపిన జగన్ సర్కారు ప్రభుత్వ ఉద్యోగుల వేతనాలను సగానికి సగం తగ్గించేసి చెల్లించింది.

మిగిలిన సగాన్ని ఎప్పుడు ఇస్తామన్న విషయాన్ని కూడా జగన్ సర్కారు చెప్పలేదు. సరే.. పరిస్థితి దయనీయంగా ఉన్న సమయంలో ప్రభుత్వంపై ఒత్తిడి తేవడం ఎందుకనుకున్నారో? ఏమో తెలియదు గానీ… ఉద్యోగులు కూడా జగన్ సర్కారుకు మద్దతుగా నిలిచారు. కిక్కురుమనకుండానే సగం వేతనాలతోనే సరిపెట్టుకున్నారు.

ఇక్కడిదాకా బాగానే ఉన్నా… ఉద్యోగుల వేతనాలను పూర్తి స్థాయిలో చెల్లించేందుకు డబ్బుల్లేవని చెప్పిన జగన్ సర్కారు… తాను ఇదివరకే ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలకు ఏమాత్రం నిధులు తగ్గించడం లేదు. సరే… ఎప్పుడో ప్రారంభమైపోయిన సంక్షేమ పథకాలు ఆపినా.. ఆయా వర్గాలు ఇబ్బందిపడతాయన్న వాదనతో ఎలాగోలా నిధులు సర్దుబాటు చేసినా… ఇటీవలే వైఎస్సార్ సున్నా వడ్డీ పథకం అంటూ మరో సంక్షేమ పథకానికి జగన్ సర్కారు శ్రీకారం చుట్టింది. డ్వాక్రా మహిళలకు సున్నా వడ్దీ కింద రుణాలు ఇప్పించేందుకు, ఇదివరకే ఇచ్చిన రుణాలకు వడ్డీ కింద మొన్న ఏకంగా రూ.1,400 కోట్లను విడుదల చేశారు.

ఉద్యోగుల వేతనాలకే డబ్బుల్లేవంటూ సాగిన జగన్ సర్కారు… కరోనా వేళ ఉద్యోగులకు సగం వేతనాలిచ్చి…ఇలా కొత్తగా సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టడం అవసరమా? అన్న ప్రశ్నలు వినిపిస్తున్నాయి. అంతేకాకుండా ఉద్యోగుల వేతనాల్లో కోతలతో మిగిలిన డబ్బుతోనే ఈ పథకానికి నిధులు సర్దారా? అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అయితే… ఈ తరహా ద్వంద్వ వైఖరిపై అటు ఉద్యోగ సంఘాలు కూడా కిక్కురుమనకపోవడం మరింత ఆశ్చర్యం కలిగిస్తోందని చెప్పక తప్పదు.