పార్లమెంట్ ఎన్నికలలో తెలంగాణ నుండి బరిలోకి దింపిన నలుగురు అభ్యర్థులకు బీజేపీ షాక్ ఇచ్చింది. సికింద్రాబాద్ నుండి పోటీ చేస్తున్న కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, మెదక్ నుండి బరిలోకి దిగిన మాజీ ఎమ్మెల్యే రఘునందన్ రావు, భువనగిరి నుండి పోటీ చేస్తున్న మాజీ ఎంపీ బూర నర్సయ్య గౌడ్, మహబూబ్ నగర్ నుండి పోటీ చేస్తున్న మాజీ మంత్రి, బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకె అరుణలు ఇప్పటికే నామినేషన్లు దాఖలు చేసి ప్రచారంలో దూసుకు వెళ్తున్నారు.
అయితే నలుగురు అభ్యర్థులకు మాత్రం బీ ఫాంలు పెండింగ్ లో పెట్టడం, అందులో హైదరాబాద్ అభ్యర్థి మాధవీలత కూడా ఉండడం అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తున్నది. బీఆర్ఎస్ నుండి బీజేపీలో చేరిన మహబూబాబాద్ అభ్యర్థి ప్రొఫెసర్ సీతారాం నాయక్, నల్లగొండ నుండి పోటీ చేస్తున్న మాజీ బీఆర్ఎస్ ఎమ్మెల్యే శానంపూడి సైదిరెడ్డితో పాటు పెద్దపల్లి బీజేపీ అభ్యర్థి గోమాస శ్రీనివాస్ లకు బీజేపీ బీఫాంలు ఇవ్వకుండా నిలిపివేసింది.
హైదరాబాద్ అభ్యర్థి మాధవీలత ప్రచారంలో అందరినీ ఆకర్షిస్తున్నారు. ఇటీవల ఓ ఛానల్ లో ఆమె ఇంటర్వ్యూ అందరూ చూడాలని స్వయంగా ప్రధాని మోడీ ఎక్స్ ఖాతా ద్వారా అభ్యర్థించారు. ఇక ఏరి కోరి బీఆర్ఎస్ నుండి సైదిరెడ్డి, సీతారాం నాయక్ లను చేర్చుకుని ఎంపీ టికెట్లు బీజేపీ అధిష్టానం ఇచ్చింది. మరి ఇప్పుడు బీఫాంలు నిలిపివేయడం వెనక వ్యూహం ఏమిటి అన్నది ఆందరినీ ఆలోచనలో పడేసింది.