‘వై నాట్ కుప్పం’ అని గతంలో వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఎలా అనగలిగారు.? అప్పటికి పరిస్థితులు వైసీపీకి అంత అనుకూలంగా కనిపించాయి మరి.
సుదీర్ఘ రాజకీయ అనుభవం వున్న చంద్రబాబు, కుప్పంలో వైసీపీ మార్కు రాజకీయం చూసి ఆశ్చర్యపోయారు, ఆందోళన చెందారు కూడా.! కానీ, ఎన్నికల నాటికి పరిస్థితులు అనూహ్యంగా మారిపోయాయి. టీడీపీ అధినేత చంద్రబాబు టార్గెట్‌గా వైఎస్ జగన్ అనుసరించిన రాజకీయ వ్యూహాలు కొన్ని బెడిసికొట్టాయి. కొన్ని వైసీపీకే రివర్స్ ఎటాక్ ఇచ్చాయి కూడా.
ఎన్నికలకు సంబంధించి నామినేషన్ ప్రక్రియ ప్రారంభమైంది. చంద్రబాబు తరఫున ఆయన సతీమణి నారా భువనేశ్వరి నామినేషన్ పత్రాల్ని సమర్పించారు కూడా. భారీ ర్యాలీతో ఈ నామినేషన్ పత్రాల సమర్పణ కార్యక్రమం జరిగింది. నిజానికి, టీడీపీ కూడా ఈ స్థాయి జన సందోహాన్ని ఊహించి వుండదు.
మారిన సమీకరణాల ప్రకారం చూస్తే, కుప్పంలో టీడీపీ అధినేత నారా చంద్రబాబునాయుడు రికార్డు స్థాయి మెజార్టీని కైవసం చేసుకునేలా వున్నారు.
‘కుప్పంలో వైసీపీ అభ్యర్థి గెలిస్తే, మంత్రి అవుతారు..’ అని కొన్నాళ్ళ క్రితం వైఎస్ జగన్ జగన్ చేసిన ప్రకటన బెడిసి కొట్టింది. ‘కుప్పంలో చంద్రబాబు గెలిస్తే.. ఇంకోసారి కుప్పం నియోజకవర్గానికే ముఖ్యమంత్రి పదవి వస్తుంది..’ అని కుప్పం ప్రజానీకం అంటున్నారు.
క్రమంగా వైసీపీ అభ్యర్థి ఎన్నికల ప్రచారం తాలూకు జోరు కూడా తగ్గిపోయింది. గతంలోలా వైసీపీ సీనియర్ నేత, మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రా రెడ్డి కుప్పంపై ఫోకస్ పెట్టే పరిస్థితి లేదు. ఆయనకు సొంత నియోజకవర్గంలో పరిస్థితులు కొంత ఇబ్బందికరంగా మారాయ్.