సార్వత్రిక ఎన్నికలతో పాటు అసెంబ్లీ ఎన్నికల కారణంగా ఆంధ్రప్రదేశ్‌లో పొలిటికల్ హీట్ మరింతగా పెరిగింది. అధికార వైసీపీ.. టీడీపీ, జనసేన, బీజేపీ కూటమికి మధ్య పోరు రసవత్తరంగా సాగుతోంది. నియోజకవర్గాల వారీగా ఫైట్ ఆసక్తి రేపుతోంది. ఈ నేపథ్యంలో వైసీపీకి చెక్ పెట్టేందుకు టీడీపీ అధినేత చంద్రబాబు ప్రత్యేక వ్యూహాలు సిద్ధం చేస్తున్నారు. ముఖ్యంగా గత ఎన్నికల్లో టీడీపీ నుంచి గెలిచి ఆ తర్వాత వైసీపీలోకి వెళ్లిన నాయకులను బాబు ప్రత్యేకంగా టార్గెట్ చేశారని తెలిసింది. ఇందులో ముఖ్యంగా వల్లభనేని వంశీ ఓటమి కోసం బాబు ప్రణాళికలు చేస్తున్నారని టాక్.
గన్నవరం నియోజకవర్గం టీడీపీకి కంచుకోట లాంటిది. ఈ నియోజకవర్గంలో అత్యధిక సార్లు టీడీపీ నాయకులే గెలిచారు. 2009 నుంచి ఇక్కడ టీడీపీకి ఎదురులేదు. 2014, 2019 ఎన్నికల్లో ఇక్కడ టీడీపీ నుంచి వంశీ విజయం సాధించారు. కానీ గత ఎన్నికల్లో గెలిచిన తర్వాత ఆయన పార్టీ ఫిరాయించారు. జగన్‌కు అనుకూలంగా వ్యవహరించి చివరకు వైసీపీలోకి వెళ్లిపోయారు. ఇప్పుడు వైసీపీ నుంచి గన్నవరంలో పోటీకి దిగారు. ఇక్కడ టీడీపీ బలంగా ఉండటంతో వంశీకి చెక్ పెట్టేందుకు బాబు కసరత్తులు చేస్తున్నారు. అంతే కాకుండా చంద్రబాబు భార్యపై వంశీ అనుచిత వ్యాఖ్యల కారణంగా ఈ సారి ఆయన్ని ఓడించాలని టీడీపీ శ్రేణులు కూడా ఆవేశంతో ఉన్నాయి.
టీడీపీ నుంచి వైసీపీలోకి వెళ్లి పోటీకి సిద్ధమైన వంశీకి అడ్డుకట్ట వేసేందుకు వైసీపీ నుంచి వచ్చిన యార్లగడ్డ వెంకట్రావును బాబు రంగంలోకి దించారు. గత ఎన్నికల్లో స్వల్ప ఓట్ల తేడాతో ఓడిపోయిన యార్లగడ్డ ఈ సారి టీడీపీ బలంతో గెలిచేందుకు సిద్ధమవుతున్నారు. గన్నవరంలో వంశీ వ్యక్తిగత ఇమేజ్ కంటే కూడా టీడీపీ ఇమేజ్ ఎక్కువ అని చాటేందుకు ఇక్కడ కచ్చితంగా జెండా ఎగరేయాలని బాబు పట్టుదలతో కనిపిస్తున్నారు. అందుకే ఎప్పటికప్పుడూ నియోజవకర్గంలోని పరిస్థితిని సమీక్షిస్తూ స్థానిక నాయకులతో టచ్‌లో ఉంటున్నారు. వైసీపీ నుంచి వచ్చిన యార్లగడ్డ విజయానికి నాయకులందరూ సహకరించేలా చూస్తున్నారు. వివాదాస్పద వంశీ వ్యవహార శైలిని ప్రజల ముందు పెట్టి లబ్ధి పొందేలా బాబు వ్యూహాలు అమలు చేస్తున్నారు. ఇక్కడ పోటీ హోరాహోరీగా ఉన్నట్లు కనిపిస్తున్నా మరోసారి గన్నవరం టీడీపీదేననే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
Gulte Telugu Telugu Political and Movie News Updates