ఔను.. జ‌గ‌న్‌కు త‌గిలింది గుల‌క‌రాయే!

ఏపీ సీఎం జ‌గ‌న్‌పై విజ‌య‌వాడ శివారు ప్రాంతం సింగ్‌న‌గ‌ర్‌లో జ‌రిగిన రాయి దాడి ఘ‌ట‌న‌కు సంబంధిం చి దాదాపు విచార‌ణ పూర్త‌యిన‌ట్టు తెలిసింది. మొత్తం ఈ కేసులో ఆరుగురు నిందితుల‌ను అరెస్టు చేశారు. వీరిలో దుర్గారావు, స‌తీష్ అనే ఇద్ద‌రు యువ‌కులు ప్ర‌ధాన నిందితులుగా పోలీసులు పేర్కొంటున్నారు. ఇక‌, సీఎం జ‌గ‌న్‌పై దాడి చేసేందుకు ఉపయోగించిన రాయి.. “సున్న‌పు రాయి” లేదా “గుల‌క రాయి”గా నిర్ధారించారు. అందుకే.. ఇది విసిర‌న‌ప్పుడు.. కంట్లో కూడా.. ఇసుక పడింద‌ని చెబుతున్నారు.

ఇక‌, ఈ కేసులో టీడీపీ నేత‌ల‌పై అనుమానాలు వ్య‌క్తం చేసిన‌ప్ప‌టికీ.. దీనికి సంబంధించి ప‌క్కా ఆధారాలు మాత్రం పోలీసుల‌కు ల‌భించ‌లేదు. ఈ నేప‌థ్యంలో నిందితుల‌ను రెండు రోజుల పాటు ర‌హ‌స్య ప్రాంతం లో విచారించిన పోలీసులు.. గురువారం స్థానిక కోర్టులో ప్ర‌వేశ పెట్టేందుకు రెడీ చేశారు. ఇదిలావుంటే.. మ‌రోవైపు, టీడీపీ నాయ‌కులు ఎన్నిక‌ల సంఘానికి మ‌రోసారి ఫిర్యాదులు చేశారు. త‌మ పాత్ర‌పై పోలీసులు అన‌వ‌స‌రంగా మీడియాకు లీకులు ఇస్తున్నార‌ని వారు చెబుతున్నారు.

కీల‌క‌మైన ఎన్నిక‌ల స‌మ‌యంలో సానుభూతి పొందేందుకు వైసీపీ నేత‌లు చేస్తున్న నాట‌కంలో పోలీసులు పాత్ర ధారులుగా మారార‌ని.. పార్టీ నాయ‌కుడు వ‌ర్ల రామ‌య్య ఆరోపించారు. నిజాలు తెలుసుకునేందుకు నిష్ప‌క్ష పాతంగా విచార‌ణ జ‌రిపించాల‌ని కోరారు. మ‌రోవైపు.. రాయి దాడి ఘ‌ట‌న‌ను ఎన్నిక‌ల‌లో వినియోగించుకోకుండా.. పార్టీల‌ను ఆదేశించాల‌ని కోరుతూ.. ప్ర‌జాసంఘాలు ఎన్నిక‌ల సంఘానికి లిఖిత పూర్వ‌క విజ్ఞ‌ప్తి చేశాయి. మొత్తంగా గుల‌క‌రాయి ఘ‌ట‌న దాదాపు ముగిసి పోయిన‌ట్టేన‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు.