తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు కేసీఆర్ ఇంటి వద్ద క్షుద్రపూజల వ్యవహారం కలకలం రేపుతున్నది. శాసనసభ ఎన్నికల్లో ఓటమి తర్వాత ప్రగతి భవన్ ఖాళీ చేసి ఎర్రవల్లి వ్యవసాయ క్షేత్రానికి వెళ్లిపోయిన కేసీఆర్ దురదృష్టవశాత్తు బాత్రూంలో జారిపడడంతో తుంటి ఎముకకు ఆపరేషన్ చేశారు. అనంతరం కొన్నాళ్లు హైదరాబాద్ లోని నంది నగర్ లో విశ్రాంతి తీసుకున్న కేసీఆర్ తిరిగి తన వ్యవసాయ క్షేత్రానికి వెళ్లి పోయారు.
ఎన్నికల్లో ఓటమి తర్వాత కొందరు పార్టీ ఎమ్మెల్యేలు, ఎంపీలు, మాజీ మంత్రులు బీఆర్ఎస్ ను వీడి బీజేపీ, కాంగ్రెస్ పార్టీలలో చేరిపోతున్నారు. కూతురు కవితను మద్యం కేసులో ఈడీ అరెస్టు చేసింది. ఈ నేపథ్యంలో బీఆర్ఎస్ పార్టీ తెలంగాణలో మరోసారి పరీక్షా సమయాన్ని ఎదుర్కొంటున్నది. ఈ తరుణంలో క్షుద్రపూజల వ్యవహారం ఉత్కంఠ రేపుతున్నది.
నందినగర్ లోని కేసీఆర్ నివాసం సమీపంలో ఖాళీ స్థలం ఉంటుంది. అక్కడ ఎవరో క్షుద్రపూజలు చేసిన ఆనవాళ్లు కనిపించాయి. నిమ్మకాయలు, ఓ బొమ్మ, మిరపకాయలు, నల్లకోడి ఈకలు, కోడిగుడ్డు, కుంకుమ కనిపించడంతో చుట్టుపక్కల ఉన్నవాళ్లు కేసీఆర్ ఇంటి వద్ద ఉన్న భద్రతా సిబ్బందికి తెలపడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. ఈ పూజలు ఎవరు చేశారు ? కేసీఆర్ మీదనే కేసీఆర్ ను ఉద్దేశించే ఈ పూజలు చేశారా ? అన్న అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.
Gulte Telugu Telugu Political and Movie News Updates