దక్షిణాదిన కర్ణాటక మినహా ఇతర రాష్ట్రాలలో పెద్దగా ప్రభావం చూపలేని భారతీయ జనతా పార్టీ ఈ లోక్ సభ ఎన్నికలలో ప్రధానంగా తెలంగాణ మీద దృష్టిపెట్టింది. 2019 ఎన్నికల తర్వాత గత ఐదేళ్లుగా తెలంగాణలో పట్టు సాధించేందుకు బీజేపీ ప్రయత్నాలు చేస్తూనే ఉంది. పలు ఉప ఎన్నికలతో పాటు, ఇటీవల శాసనసభ ఎన్నికల వరకు మోడీ, అమిత్ షా తో పాటు అనేక మంది కేంద్ర మంత్రులను శాసనసభ స్థానాలకు ఇంఛార్జులుగా నియమించి ప్రచారానికి రావడం బీజేపీ ఫోకస్ ను స్పష్టం చేస్తుంది. జీహెచ్ఎంసీ ఎన్నికలకు కూడా ప్రధాని మోడీ, హోంమంత్రి అమిత్ షాలు ప్రచారానికి రావడం ప్రస్తావనార్హం.
రామమందిరం ఉత్తరాదిన మెజారిటీ స్థానాలు కట్టబెడుతుందని బీజేపీ అధిష్టానం బయటకు చెబుతున్నా అంతర్గతంగా వారికి అపనమ్మకం ఉండడం మూలంగా దక్షిణాదిన గణనీయంగా లోక్ సభ స్థానాలు గెలుచుకోవాలని ప్రయత్నాలు ముమ్మరం చేసింది. కర్ణాటకలో పాలనలో కాంగ్రెస్ పార్టీ విఫలం కావడం, జేడీఎస్ పొత్తు మూలంగా అక్కడ బీజేపీ ఖచ్చితంగా లాభపడుతుందని భావిస్తున్నారు. ఇక తెలంగాణ గవర్నర్ గా ఉన్న తమిళి సైని రాజీనామా చేయించి చెన్నై నుండి బరిలోకి దింపడం బీజేపీ పట్టుదలకు నిదర్శనంగా కనిపిస్తుంది. ఇక తెలంగాణలో ఓట్ల శాతం గణనీయంగా పెరుగుతున్న ఎన్ని సీట్లు వస్తాయి అన్నది ఆఖరు నిమిషం వరకు ప్రశ్నార్ధకమే. ఫలానా స్థానం ఖచ్చితంగా గెలిచి తీరుతామని చెప్పే పరిస్థితి బీజేపీకి లేదు.
కర్ణాటక, తెలంగాణ, తమిళనాడు మీద ఇంత దృష్టి పెట్టిన బీజేపీ అధిష్టానం ఆంధ్రప్రదేశ్ లో వ్యవహరిస్తున్న తీరు మాత్రం ఆశ్చర్యకరంగా ఉంది. అక్కడ టీడీపీ, జనసేనతో పొత్తులో భాగంగా బీజేపీకి ఇక్కడ 10 అసెంబ్లీ, 6 లోక్ సభ స్థానాలను కేటాయించారు. పొత్తు కుదిరిన తర్వాత ప్రధాని నరేంద్రమోడి లాంఛనప్రాయంగా చిలుకలూరిపేట సభకు వచ్చిపోయారు. ఆ తర్వాత నెల రోజులు గడుస్తున్నా అటు వైపు బీజేపీ అధిష్టానం గానీ, ఏపీలో ఉన్న సీనియర్ బీజేపీ నేతలు గానీ కన్నెత్తి చూడడం లేదు.
ఇక ఇక్కడ పోటీ చేస్తున్న అభ్యర్థులలో బీజేపీయేతరులు, టీడీపీ నుండి వచ్చి బీజేపీ తరపున పోటీ చేస్తున్న వారు ఉండడం గమనార్హం. 2014 ఎన్నికలలో పవన్ మద్దతు, బీజేపీ పొత్తు మూలంగా చంద్రబాబు నాయుడు అధికారాన్ని దక్కించుకున్నాడు. 2019లో ఒంటరిగా బరిలోకి దిగడంతో అధికారం కోల్పోవాల్సి వచ్చింది. ఈ నేపథ్యంలో బీజేపీ వెంటపడి మరీ టీడీపీ పొత్తు పెట్టుకున్నది. ఇక 2019 ఎన్నికల తర్వాత గత ఐదేళ్లుగా జగన్ మోడీ ప్రభుత్వానికి అనేక అంశాలలో మద్దతుగా నిలుస్తున్నాడు. అందుకే ఆంధ్రాలో టీడీపీ, బీజేపీ, జనసేన కూటమి నుండి ఎవరు గెలిచినా, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుండి ఎవరు గెలిచినా కేంద్రంలో బీజేపీకే మద్దతు ఇస్తారు. అందుకే ఆంధ్రా రాజకీయాలలో తలదూర్చకుండా బీజేపీ అధిష్టానం సేఫ్ గేమ్ ఆడుతుందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.