‘రేసుగుర్రం’ సినిమాలో విలన్ గా శివారెడ్డి పాత్రలో నటించిన భోజ్ పురి నటుడు రవికిషన్ అందరినీ అలరించి తెలుగువారికి దగ్గరయ్యాడు. నటనలోనే కాదు రాజకీయాల్లోనూ అతను విజయవంతం అయ్యాడు. 2019 లోక్ సభ ఎన్నికలలో ఉత్తరప్రదేశ్ గోరఖ్ పూర్ నుండి బీజేపీ తరపున పోటీ చేసి ఎంపీగా ఎన్నికయ్యాడు. రెండో సారి కూడా ఎన్నికలలో నిలబడేందుకు అతను సిద్దమవుతున్న సమయంలో ఓ వివాదంలో చిక్కుకున్నాడు.
రవికిషన్ కు ప్రీతి కిషన్ అనే భార్యతో పాటు రివా, తనిష్క్, ఇషిత అనే ముగ్గురు సంతానం కూడా ఉన్నారు. తాజాగా మీడియా ముందుకు వచ్చిన అపర్ణా ఠాకూర్ అనే మహిళ 1996లోనే రవికిషన్ తనను రహస్యంగా వివాహం చేసుకున్నాడని, తమకు 15 ఏళ్ల వయసున్న ఒక కూతురు కూడా ఉందని, ఇప్పటికీ ఆయన తమతో టచ్ లో ఉన్నాడని వెల్లడించింది.
వారి కూతురుగా చెప్పుకుంటున్న బాలిక మీడియాతో మాట్లాడుతూ నాకు 15 ఏళ్లు వచ్చే వరకు రవికిషన్ తనకు తండ్రి అని తెలియదని, ఆయనను అంకుల్ అని పిలిచేదాన్నని, ఆయన కుటుంబాన్ని కూడా తాను కలిశానని, తండ్రిగా నా దగ్గర ఆయన ఎప్పుడూ లేరని, తనను కూతురిగా స్వీకరించాలని కోరింది. లోక్ సభ ఎన్నికల ముందు రవికిషన్ ఈ వివాదంలో ఇరుక్కోవడం బీజేపీ శ్రేణులలో ఉత్కంఠ కలిగిస్తున్నది. ఈ విషయంలో బీజేపీ అధిష్టానం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుంది అని అందరూ ఎదురు చూస్తున్నారు.
Gulte Telugu Telugu Political and Movie News Updates