ర‌ఘురామ‌కు న‌ర‌సాపురం టికెట్టే.. ప‌ట్టు బ‌ట్టిన బాబు

వైసీపీ రెబల్ ఎంపీగా నిత్యం మీడియా ముందుకు వ‌చ్చి విమ‌ర్శ‌లు గుప్పించిన ర‌ఘురామ‌కృష్ణ‌రాజు కోసం.. టీడీపీ అధినేత చంద్ర‌బాబు త్యాగాల బాట ప‌ట్టారు. తాజాగా జ‌రిగిన కూట‌మి(జ‌న‌సేన‌-బీజేపీ-టీడీపీ) స‌మావేశంలోనూ ర‌ఘురామ కేంద్రంగానే చ‌ర్చ‌లు జ‌రిగాయి. ఆయ‌న‌కు టికెట్ ఇచ్చితీరాల‌ని చంద్ర‌బాబు బ‌ల్ల‌గుద్ది మ‌రీ చెప్పారు. అంతేకాదు.. న‌ర‌సాపురం టికెట్‌ను బీజేపీకి కేటాయించింది కూడా.. కేవ‌లం ర‌ఘురామను దృష్టిలో పెట్టుకునే చేశామ‌ని చెప్పిన‌ట్టు తెలిసింది.

అయిందేదో అయిపోయిందని.. న‌ర‌సాపురం టికెట్‌ను త‌మ‌కు ఇచ్చేయాల‌ని చంద్ర‌బాబు ష‌ర‌తు పెట్టిన‌ట్టు పార్టీ వ‌ర్గాలు చెబుతున్నాయి. న‌ర‌సాపురం టికెట్‌ను తామే తీసుకుని ర‌ఘురామ‌కు ఇస్తామ‌ని.. ఇక్క‌డ నుంచి బ‌రిలో ఉన్న బీజేపీ నేత‌.. శ్రీనివాస‌వ‌ర్మ‌కు ఉండి టికెట్‌(అసెంబ్లీ) ఇవ్వాల‌ని చంద్ర‌బాబు బ‌లంగా చెప్పారు. గెలిచే స్థానంలో న‌ర‌సాపురం ఉంద‌ని.. దీనిని వ‌దులుకోవ‌డం స‌రికాద‌న్నారు. ముఖ్యంగా బీజేపీ కోసం కూడా.. ర‌ఘురామ ప్ర‌త్య‌క్షంగా ప‌రోక్షంగా అనేక పోరాటాలు చేశార‌న్నారు.

ప్ర‌ధాన మంత్రి న‌రేంద్ర మోడీని దేవుడిగా ప‌లు మార్లు ర‌ఘురామ పేర్కొన్న విష‌యాన్ని కూడా చంద్ర‌బాబు ఆ పార్టీ కీల‌క నేత‌ల ముందు.. ఆధారాలతో స‌హా వెల్ల‌డించారు. ఈ నేప‌థ్యంలో ర‌ఘురామ‌కు ఖ‌చ్చితంగా టికెట్ ఇచ్చితీరాల‌ని.. ఈ విష‌యంలో మార్పు ఉండ‌ద‌ని.. మీరు ఇవ్వ‌క‌పోతే.. మేమే ఆయ‌న‌కు న‌ర‌సాపురం టికెట్ ఇస్తామ‌ని చంద్ర‌బాబు చెప్పుకొచ్చారు. అయితే.. దీనిపై పార్టీ లో చ‌ర్చించి నిర్ణ‌యంతీసుకుంటామ‌ని బీజేపీ అగ్ర‌నేత‌లు చంద్ర‌బాబు హామీ ఇచ్చారు.

ర‌ఘురామ కోసం.. చంద్ర‌బాబు ఇంత‌గా ప‌ట్టుబ‌ట్ట‌డం వెనుక‌.. ఆయ‌న చ‌రిష్మాతోపాటు.. న‌ర‌సాపురం పార్ల‌మెంటు ప‌రిధిలోని 7 అసెంబ్లీ స్థానాల్లోనూ ఆయ‌న ప్ర‌భావం క‌నిపిస్తుండ‌డ‌మే కార‌ణ‌మ‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు. వ‌చ్చే ఎన్నిక‌ల్లో ర‌ఘురామ‌పై ఉన్న సింప‌తీ ప‌నిచేస్తుంద‌ని, త‌ద్వారా.. వైసీపీకి ప‌శ్చిమ గోదావ‌రిలో చెక్ ప‌డుతుంద‌ని చంద్ర‌బాబు లెక్క‌లు వేసుకున్నారు. ఈ నేప‌థ్యంలోనే ఇప్ప‌టివ‌ర‌కు ఎవ‌రూ చేయ‌ని విధంగా ప‌ట్టు ప‌డుతున్నార‌ని పార్టీ వ‌ర్గాలు చెబుతున్నాయి. తాజా ప‌రిణామాల నేప‌థ్యంలో ర‌ఘురామ‌కు న‌ర‌సాపురం టికెట్ ద‌క్క‌డం ఖాయ‌మ‌ని అంటున్నారు.