టీడీపీకి బలమైన నాయకుడిగా పేరు తెచ్చుకున్న కర్నూలు జిల్లా ముఖ్య నాయకుడు కేఈ ప్రభాకర్.. ఆ పార్టీకి రాజీనామా చేయనున్నట్టు ప్రకటించారు. తన కుమారుడు కేఈ రుద్ర ఆలోచనల మేరకు తాము వైసీపీలోకి వెళ్తామని తెలిపారు. ప్రస్తుత ఎన్నికల్లో చంద్రబాబు తమను పట్టించుకోలేదన్నారు. పార్టీలో కష్టపడి పనిచేసేవారికి ప్రాధాన్యం లేదని ఈ సందర్భంగా కేఈ విమర్శలు గుప్పించారు. ఎక్కడ నుంచో వచ్చిన వారికి తాము పనిచేయాలా? అని ప్రశ్నించారు. వైసీపీలో చేరిపై తాము ప్రకటన చేస్తామన్నారు.
దీంతో ఉమ్మడి కర్నూలు జిల్లాలో బలమైన కేఈ కుటుంబం టీడీపీకి దూరమయ్యే పరిస్థితి ఏర్పడింది. ఇక, కేఈ ప్రభాకర్.. ఎవరో కాదు.. గత ఐదేళ్ల టీడీపీ హయాంలో మంత్రిగా పనిచేసిన సీనియర్ నాయకుడు కేఈ కృష్ణమూర్తి సోదరుడే.. అప్పట్లో కేఈ ప్రభాకర్.. యాక్టివ్‌గా పనిచేశారు. డోన్ సహా , శ్రీశైలం నియోజకవర్గంలో ఆయన హవా ఇప్పటికీ ఉంది. ముఖ్యంగా డోన్ నియోజకవర్గంలో వైసీపీకి కంటిపై కునుకు లేకుండా చేశారనడంలో సందేహం లేదు.
వైసీపీ ముఖ్య నేత, మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డిపై ప్రతి రోజూ విమర్శలు చేయడంతోపాటు.. పాద యాత్ర చేసి మరీ.. టీడీపీని ఇక్కడ బలోపేతం చేశారు కేఈ ప్రభాకర్. ప్రస్తుత ఎన్నికల్లో ఆయన టికెట్ ఆశించారు. కానీ, ఆయన పేరును చంద్రబాబు పరిగణనలోకి తీసుకోలేదు. దీంతో కొన్నాళ్లుగా అలిగిన ఆయన పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉన్నారు. ఇక, కేఈ కృష్నమూర్తి కుమారుడు కేఈ శ్యాంబాబుకు.. చంద్రబాబు పత్తికొండ టికెట్ ఇచ్చారు.
ఇదేసమయంలో పార్టీలో రెండో ప్లేస్‌లో ఉన్నానని చెప్పిన ప్రభాకర్‌ను పట్టించుకోలేదు. దీంతో ఇప్పుడు పార్టీకి ఆయన రిజైన్ చేసే వరకు పరిస్థితి వచ్చింది. మరి దీనిని చంద్రబాబు సరిదిద్దుకుంటారా? లేక వదిలేస్తారా? అన్నది చూడాలి. వైసీపీలోకి కనుక కేఈ వెళ్లిపోతే.. మొత్తంగా మూడు నియోజకవర్గాలపై ప్రభావం చూపించడంతోపాటు.. కర్నూలు పార్లమెంటు నియోజకవర్గంపైనా వీరి ప్రభావం పడుతుందని అంటున్నారు పరిశీలకులు. మరి చంద్రబాబు ఏం చేస్తారో చూడాలి.