వైసీపీ అధినేత, సీఎం జగన్‌ను తొలిసారి టీడీపీ అధినేత చంద్రబాబు డిఫెన్స్‌లో పడేశారా? చంద్రబాబు చేసిన కీలక ప్రకటన తర్వాత జగన్ ఒకింత ఆలోచనలో పడ్డారా? అంటే.. ఔననే అంటున్నారు పరిశీలకులు. వాస్తవానికి ప్రస్తుత ఎన్నికల సమయం లో చంద్రబాబు అనేక విషయాలను ప్రస్తావిస్తున్నారు. ప్రజాగళం పేరుతో ఆయన ఎన్నికల ప్రచారం చేస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో రాష్ట్ర వ్యాప్తంగా పర్యటిస్తూ.. పలు అంశాలను చర్చిస్తున్నారు. ఘాటు విమర్శలు కూడా చేస్తున్నారు. ఇదే సమయంలో రెండు కీలక అంశాలను ప్రస్తావించారు. కూటమి(జనసేన-బీజేపీ-టీడీపీ) అధికారంలోకి వస్తే.. రైతును రాజును చేస్తామన్నారు.
అంతేకాదు.. రైతులకు ఇప్పటి వరకు రుణాలను ఒకే ఒక్క సంతకంతో తీసేస్తామని చంద్రబాబు ప్రకటించారు. నిజానికి ఇది సంచలన ప్రకటనే అయినా.. వైసీపీ నుంచి కానీ.. జగన్ నుంచి కానీ పెద్దగా దీనిపై రియాక్షన్ రాలేదు. ప్రజల్లో మాత్రం చర్చ జరుగుతోంది. చంద్రబాబు ఇంత పెద్ద హామీ ఇచ్చాక వైసీపీలో అయినా.. చర్చ జరుగుతుందని అనుకున్నా జరగలేదు. ఇక, రెండోది ఇప్పటి వరకు సామాజిక భద్రతా పింఛను కింద ఇస్తున్న రూ.3000లను రూ.4000లకు పెంచుతామని చంద్రబాబు చెప్పారు. అంతేకాదు.. ఏప్రిల్(జగన్ అధికారంలో ఉన్న కాలం)-జూన్ మధ్య నుంచే దీనిని పెంచి ఇస్తామని చంద్రబాబు ప్రకటించారు.
అయినప్పటికీ.. జగన్‌లో కానీ.. వైసీపీలో కానీ.. ఎలాంటి తొట్రుపాటు కనిపించలేదు. పైగా ఎదురు దాడి చేశారు. 3000 చొప్పున ఇస్తుంటేనే రాష్ట్రాన్ని శ్రీలంక చేస్తున్నారని యాగీ పెట్టిన చంద్రబాబు ఇప్పుడు రూ.4000 ఇస్తామని ప్రకటించారని.. దీనిని ఎలా నమ్మాలని సీఎం జగన్ రెండు రోజుల కిందట కనిగిరి సభలో ప్రశ్నించారు. కట్ చేస్తే.. ఉగాది సందర్భంగా చంద్రబాబు చేసిన మరో కీలక ప్రకటన మాత్రం వైసీపీలో కలకలం రేపుతోంది. ఇది సీఎం జగన్‌ను డిఫెన్సులో పడేసిందనే వాదన వినిపిస్తోంది. ఈ విషయంలో వెంటనే స్పందించడం కూడా గమనార్హం. దీనిని బట్టి.. చంద్రబాబు ప్రకటన.. తొలిసారి వైసీపీని షేక్ చేస్తోందని అంటున్నారు.
అదే.. తాము(కూటమి) అధికారంలోకి వచ్చిన తర్వాత.. వలంటీర్లను కొనసాగిస్తామని చంద్రబాబు చెప్పడంతోపాటు.. ప్రస్తుతం వలంటీర్లకు ఇస్తున్న రూ.5000 పారితోషికాన్ని రూ.10000లకు పెంచుతామని బలమైన హామీ ఇచ్చారు. అంతేకాదు.. ఈ పెంపు తాను అధికారంలోకి వచ్చిన తక్షణమే అమలు చేస్తామన్నారు. ఈ నేపథ్యంలో వలంటీర్లు ఎవరూ రాజీనామా చేయొద్దని పిలుపునిచ్చారు. దీంతో వైసీపీ ఈ విషయంలో ఒకింత షేక్ అయిందని అంటున్నారు పరిశీలకులు. ఎందుకంటే.. ఇప్పటి వరకు వలంటీర్లంటే.. తమ వారేనని, తాము గీసిన దాటరని భావించిన వైసీపీ.. చంద్రబాబు ప్రకటన రూ.10000ల తర్వాత.. మాత్రం ఆత్మ రక్షణలో పడింది. దీనిపై ఒకటి రెండు రోజుల్లోనే సీఎం జగన్ ప్రకటన చేయనున్నట్టు తెలుస్తోంది.
Gulte Telugu Telugu Political and Movie News Updates