చిరుది కేవ‌లం డొనేషన్ కాదు

మెగాస్టార్ చిరంజీవి జ‌న‌సేన పార్టీకి ఐదు కోట్ల విరాళం ఇవ్వ‌డం ఈ రోజు హాట్ టాపిక్‌గా మారింది. త‌మ్ముడి పార్టీకి అన్న విరాళం ఇవ్వ‌డంలో విశేషం ఏముంది అనిపించ‌వ‌చ్చు. కానీ ప్ర‌స్తుత రాజ‌కీయ ప‌రిస్థితుల్లో దీన్ని ఒక కీల‌క ప‌రిణామంగానే చూడాలి. నిజానికి చిరు ఇచ్చింది కేవ‌లం విరాళం కాదు.. ఒక పెద్ద‌ స్టేట్మెంట్ అని రాజ‌కీయ విశ్లేష‌కులు భావిస్తున్నారు. మెగా అభిమానుల్లోనే ఇప్పుడు ర‌క‌ర‌కాల వ‌ర్గాలు ఏర్ప‌డ్డాయి.

చిరు అభిమానుల్లో ఓ వ‌ర్గం ప‌వ‌న్‌ను వ్య‌తిరేకించ‌డం.. ప‌వ‌న్ ఫ్యాన్స్‌లో కొంద‌రు చిరును రాజ‌కీయంగా విమ‌ర్శించ‌డం లాంటివి చేస్తుంటారు. మ‌రోవైపు చిరు గ‌తంలో ఏపీ సీఎం జ‌గ‌న్‌తో స‌న్నిహితంగా వ్య‌వ‌హ‌రించ‌డం చ‌ర్చ‌నీయాంశం అయింది. ఈ నేప‌థ్యంలో మెగా అభిమానులంద‌రూ విభేదాల‌ను ప‌క్క‌న పెట్టి.. ఏక‌తాటిపై న‌డ‌వాల‌ని చిరు చెప్ప‌క‌నే చెప్పిన‌ట్లు అయింది.

జ‌న‌సేన‌కు మెగా అభిమానుల నుంచి సంపూర్ణ మ‌ద్ద‌తు రాబ‌ట్ట‌డమే చిర‌-ప‌వ‌న్ ప్ర‌త్యేక క‌ల‌యికకు.. చిరు భారీ విరాళం ప్ర‌క‌టించ‌డానికి కార‌ణంగా స్ప‌ష్ట‌మ‌వుతోంది. అభిమానుల్లో వ‌ర్గాల వ‌ల్ల ఓట్ల చీలిక జ‌రిగి వైసీపీకి మేలు జ‌రుగుతుంద‌నే ఉద్దేశంతో తాను త‌మ్ముడికి పూర్తిమ‌ద్ద‌తు ప్ర‌క‌టించ‌డం ద్వారా మెగా అభిమానులు కూడా పూర్త‌గా ప‌వ‌న్‌కు అండ‌గా నిల‌వాల‌ని చిరు సంకేతాలు ఇచ్చార‌న్న‌ది స్ప‌ష్టం.

కేవ‌లం విరాళం మాత్ర‌మే ఇవ్వాల‌నుకుంటే.. చిరు సైలెంట్‌గా ఆ ప‌ని చేయొచ్చు. నాగ‌బాబు, వ‌రుణ్ తేజ్, రామ్ చ‌ర‌ణ్ గ‌తంలో అలాగే చేశారు. కానీ చిరు మాత్రం దీన్నొక కార్య‌క్ర‌మం లాగా చేశారు. ప‌వ‌న్‌కు ఆర్థికంగానే కాక అన్ని ర‌కాలుగా త‌న మ‌ద్ద‌తు ఉంద‌ని స్ప‌ష్టం చేశారు. మ‌రి మెగా అభిమానులు ఈ విష‌యాన్ని అర్థం చేసుకుని ఎన్నిక‌ల్లో ప‌వ‌న్‌కు పూర్తి అండ‌నిస్తారేమో చూడాలి.