ఉండి టీడీపీ అభ్యర్థిగా రఘురామ

వైసీపీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణరాజు తాజాగా టీడీపీ తీర్థం పుచ్చుకున్న సంగతి తెలిసిందే. పాలకొల్లులో జరిగిన ప్రజాగళం సభలో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు సమక్షంలో రఘురామ సైకిల్ ఎక్కారు. రఘురామకృష్ణరాజుకు టీడీపీ అధినేత చంద్రబాబు పార్టీ కండువా కప్పి సాదరంగా ఆహ్వానం పలికారు. ఉభయ గోదావరి జిల్లాలలో ఏదో ఒక అసెంబ్లీ నియోజకవర్గం నుంచి టీడీపీ తరఫున రఘురామ ఎన్నికల బరిలో దిగుతారని ప్రచారం జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే తాజాగా ఉండి అసెంబ్లీ నియోజకవర్గం నుంచి రఘురామ ఎన్నికల బరిలో దిగబోతున్నారని టీడీపీ అధినేత చంద్రబాబు ప్రకటించారు.

పాలకొల్లులో జరిగిన సమావేశంలో చంద్రబాబు ఈ విషయాన్ని వెల్లడించారు. సిట్టింగ్ ఎమ్మెల్యే రామరాజు స్థానంలో రఘురామను చంద్రబాబు అభ్యర్థిగా ప్రకటించారు. అయితే, ఈ వ్యవహారంపై ఆల్రెడీ టికెట్ దక్కించుకున్న అభ్యర్థి రామరాజు అనుచరులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారని తెలుస్తోంది. అంతకుముందు పాలకొల్లులో జరిగిన బహిరంగ సభలో చంద్రబాబు సమక్షంలో రఘురామ టీడీపీలో చేరుతూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబు వల్లే తాను ఈరోజు ప్రాణాలతో ఉన్నానని రఘురామ ఎమోషనల్ అయ్యారు. కస్టోడియల్ టార్చర్ కు గురైన తర్వాత తనకు చంద్రబాబు ధైర్యం చెప్పారని, తనపై తప్పుడు కేసులు పెట్టినప్పుడు తనకు, తన కుటుంబానికి ఆయన అండగా నిలిచారని రఘురామ గుర్తు చేసుకున్నారు.

తాను జైల్లో ఉన్న రోజు రాత్రి నిద్ర పోకుండా లాయర్లతో చంద్రబాబు మాట్లాడారని, తన కుటుంబ సభ్యులందరికీ ధైర్యం చెప్పారని అన్నారు. చంద్రబాబుకు తాను రుణపడి ఉంటానని అన్నారు. తనకోసం చంద్రబాబు ఉన్నాను.. విన్నాను అని చెప్పారని, కానీ కొంతమంది నేను ఉన్నాను…నేను విన్నాను అంటూ సొల్లు కబుర్లు చెబుతుంటారని జగన్ పై పరోక్షంగా విమర్శలు గుప్పించారు.

గత నాలుగేళ్లుగా అనే వారి కారణాల వల్ల రాష్ట్రానికి దూరంగా ఉండాల్సి వచ్చిందని వివరణ ఇచ్చే ప్రయత్నం చేశారు. తనకు అండగా నిలిచిన టీడీపీ, బీజేపీ, జనసేన అభిమానులకు కృతజ్ఞతలు చెప్పారు. జూన్ 4న చంద్రబాబు, పవన్ కళ్యాణ్, నరేంద్ర మోడీ ప్రభంజనం సృష్టించబోతున్నారని జోస్యం చెప్పారు. ఈ త్రిమూర్తుల కలయిక గురించి తాను ఏడాదికాలంగా చెబుతూనే ఉన్నానని గుర్తు చేసుకున్నారు.