బీజేపీ జాతీయ నాయకత్వం లైట్ తీసుకుంది. జనసేన పార్టీ, తాము పోటీ చేస్తున్న నియోజకవర్గాలకే పరిమితమవుతోంది. తెలుగుదేశం పార్టీ మాత్రం ఊరూ వాడా అంతా తనదేనని అంటోంది. అటు నారా లోకేష్, ఇటు చంద్రబాబు.. తెలుగుదేశం పార్టీ తరఫున ఏమాత్రం విశ్రాంతి లేకుండా ఎన్నికల ప్రచారంలో బిజీ బిజీగా వుంటున్నారు.
ఇదీ తెలుగు తమ్ముళ్ళ వాదన.! ఇందులో కొంత నిజం లేకపోలేదు. టీడీపీ – జనసేన – బీజేపీ పొత్తులో భాగంగా సీట్ల పంపకాలు పూర్తయ్యాయి. అభ్యర్థులు ఎన్నికల ప్రచారంలో బిజీగా వున్నారు. అధినేతల విషయానికొస్తే, కూటమిలో టీడీపీ ఒక్కటే యాక్టివ్‌గా వుందన్న వాదనని కొట్టి పారేయలేం.
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తీవ్ర జ్వరం కారణంగా, పిఠాపురం ఎన్నికల ప్రచారాన్ని మధ్యలోనే తాత్కాలికంగా ముగించాల్సి వచ్చింది. తిరిగి ఆయన ఎన్నికల ప్రచారాన్ని రేపటినుంచి పునఃప్రారంభిస్తారు. రాజకీయ నాయకులూ మనుషులే.. ఆరోగ్యం సహకరించకపోతే, ఎవరైనా చేయగలిగిందేమీ వుండదు.
టీడీపీకి జనసేన సహకరించట్లేదనడమూ సరికాదు. టీడీపీ పోటీ చేస్తోన్న నియోజకవర్గాల్లో జనసేన నేతలు, కార్యకర్తలు బాధ్యత తీసుకుని, టీడీపీ తరఫున ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్నారన్నది నిర్వివాదాంశం. బీజేపీ మాత్రం చాలా చాలా డల్లుగా కనిపిస్తోంది. ఇదే టీడీపీ శ్రేణులకు అస్సలు మింగుడుపడ్డంలేదు.
‘కూటమిని గెలిపించే బాధ్యత చంద్రబాబుదే..’ అన్న కోణంలో బీజేపీ చేతులెత్తేసిందని తెలుగు తమ్ముళ్ళు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నిజమే, బీజేపీ జాతీయ నాయకత్వం తరఫున రాష్ట్రంలో ఎన్నికల ప్రచారం విషయమై పెద్దగా ఆసక్తి కనిపించడంలేదు. బీజేపీకి ఏకంగా ఆరు ఎంపీ సీట్లనీ, పది అసెంబ్లీ సీట్లనీ కూటమి తరఫున కేటాయించినప్పుడు, ఎంత బాధ్యతగా వుండాలి.?
వైసీపీని ధీటుగా ఎదుర్కోవాలంటే, కూటమిలోని మూడు పార్టీలూ ఒకే రీతిన కష్టపడాల్సిన అవసరం ఎంతైనా వుంది. ఈ విషయమై బీజేపీ ఆత్మవిమర్శ చేసుకోవాల్సివుంది.
Gulte Telugu Telugu Political and Movie News Updates