త్వరలో జరగబోతున్న సార్వత్రిక ఎన్నికల్లో పులివెందుల లోక్ సభ స్థానం నుంచి ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల బరిలోకి దిగుతున్నట్లు ప్రకటించారు. ఈ నేపథ్యంలోనే తన సోదరుడు, కడప సిట్టింగ్ ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డిపై షర్మిల సంచలన వ్యాఖ్యలు చేశారు. చిన్నాన్నను హత్య చేయించిన అవినాష్ రెడ్డికి వైసీపీ ఎంపీ టికెట్ ఇవ్వడాన్ని తట్టుకోలేకపోయానని ఆవేదన వ్యక్తం చేశారు. హంతకుడు అవినాష్ ను ఓడించేందుకే కడప బరిలో దిగుతున్నానని షర్మిల షాకింగ్ ప్రకటన చేశారు.
ఈ నిర్ణయం వల్ల వైఎస్ కుటుంబం చీలుతుందని తెలిసినా పోటీ చేస్తున్నానని చెప్పుకొచ్చారు. చిన్నాన్న వివేకాను చంపించిన వారిని జగనన్న వెనుకేసుకొస్తున్నారని, నా అనుకున్న వాళ్ళను ఆయన నాశనం చేశాడని సంచలన ఆరోపణలు చేశారు. హత్యా రాజకీయాలకు జగనన్న దన్నుగా నిలిచాడని, చిన్నాన్న హంతకులను కాపాడుతున్నాడని ఆరోపించారు. చిన్నాన్నను హత్య చేయించిన అవినాష్ హంతకుడని, కడపలో మళ్ళీ ఆయన గెలవకూడదని ప్రజలకు పిలుపునిచ్చారు.
గత ఎన్నికల్లో వివేకా హత్య కేసును వైసీపీ రాజకీయ లబ్ధికి ఉపయోగించుకుందని ఆరోపించారు. తాను కడప ఎంపీగా పోటీ చేయాలన్నది చిన్నాన్న వివేకా చిరకాల కోరిక అని, అందుకోసమే కడప లోక్ సభ స్థానం నుంచి ఎన్నికల బరిలో దిగుతున్నానని షర్మిల ప్రకటించారు. న్యాయం కోసం పోరాడుతున్న తనవైపు ప్రజలు నిలబడి ఆశీర్వదించాలని ప్రజలకు షర్మిల విజ్ఞప్తి చేశారు. షర్మిల వ్యాఖ్యలపై వైసీపీ నేతల కౌంటర్ ఏ విధంగా ఉండబోతోంది అన్నది ఆసక్తికరంగా మారింది.