ఏపీ ఎన్నికలపై నరేష్ హాట్ కామెంట్

Naresh


ఆంధ్రప్రదేశ్‌లో ఎన్నికలకు సరిగ్గా ఇంకో 40 రోజుల సమయమే ఉంది. ఈసారి ఎన్నికలు ప్రధాన పార్టీలకు ఎంత కీలకమో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. దీంతో ప్రచారాన్ని ఆయా పార్టీలు హోరెత్తిస్తున్నాయి. మరోసారి అధికారం చేపట్టడం ఖాయమన్న ధీమాతో అధికార వైసీపీ ఉంటే.. కూటమి అధికారంలోకి రావడం పక్కా అని టీడీపీ, జనసేన, భాజపా పార్టీలు నమ్మకంతో ఉన్నాయి. మామూలుగా ఎన్నికల సమయంలో సినిమా వాళ్లు కూడా ప్రచారంలో హడావుడి చేస్తారు. నే

రుగా రంగంలోకి దిగకపోయినా ఒక పార్టీకి అనుకూలంగానో, ప్రతికూలంగానో మాట్లాడతారు. ఎన్నికల ఫలితాలపై అంచనాలు వేస్తుంటారు. కానీ రకరకాల కారణాల వల్ల ఈసారి రాజకీయ రంగు పులుముకోవడానికి సినీ జనాలు సిద్ధంగా లేరు. చాలా వరకు వ్యూహాత్మక మౌనమే పాటిస్తున్నారు.

ఇలాంటి సమయంలో సీనియర్ నటుడు నరేష్.. ఏపీ ఎన్నికలపై ఒక ఆసక్తికర ట్వీట్ వేశారు. ‘‘ఈసారి ఆంధ్రప్రదేశ్‌లో అధికార మార్పిడి జరిగేలోపు రక్తపాతం జరగడానికి చాలా మెండుగా అవకాశాలు ఉన్నది నా నమ్మకం’’ అని ఆయన ఈ రోజు ట్వీట్ వేశారు. ఈసారి ఎన్నికలు రణరంగాన్ని తలపిస్తాయనే అంచనా రాజకీయ విశ్లేషకుల్లో ఉంది. అధికారం పోతే వైసీపీకి, ఈసారి అధికారం చేపట్టకపోతే టీడీపీ, జనసేనలకు చాలా చాలా కష్టమవుతుంది. కాబట్టి విజయం కోసం ప్రాణాలొడ్డి పోరాడాల్సిన పరిస్థితి తప్పదు. దీన్ని దృష్టిలో ఉంచుకునే నరేష్ ఈ వ్యాఖ్య చేసి ఉండొచ్చని భావిస్తున్నారు.

అలాగే గత ఎన్నికలకు ముందు వివేకా హత్య, కోడికత్తి దాడి లాంటి ఘటనలు ఈసారి కూడా రిపీట్ కావచ్చన్న ఉద్దేశంతో కూడా ఆయన ఈ కామెంట్ చేసి ఉండొచ్చు. ఇవన్నీ పక్కన పెడితే అధికార మార్పిడి జరగబోతోందని నరేష్ అంచనా వేయడం ఇక్కడ గమనించాల్సిన విషయం.