‘షర్మిలకే నా మద్దతు.. ఆమె కోసం ఇల్లిల్లూ తిరుగుతా.. జగన్‌ను మట్టి కరిపిస్తా!’ అని ఏపీ సీఎం జగన్ చిన్నాన్న వివేకానందరెడ్డి కుమార్తె డాక్టర్ నర్రెడ్డి సునీత సంచలన వ్యాఖ్యలు చేశారు. కడప నుంచి కాంగ్రెస్ టికెట్‌పై బరిలోకి దిగుతున్న ఆ పార్టీ ఏపీ చీఫ్ షర్మిలకు ఆమె మద్దతు ప్రకటించారు. జగన్ జైల్లో ఉన్నప్పుడు షర్మిల పాదయాత్ర చేశారని, వైసీపీని గెలిపించారని చెప్పారు. కష్టపడి పని చేసి పార్టీని గెలిపించిన షర్మిలను చూసి జగన్ భయడ్డారని అన్నారు. తన కంటే షర్మిలకు ఎక్కువ పేరు వస్తుందని ఆందోళన చెందారని అందుకే పార్టీలో ఎలాంటి ప్రాధాన్యం లేకుండా పక్కన పెట్టారని విమర్శించారు.
ఔను.. అందరికీ తెలుసు!
తన తండ్రి వివేకానందరెడ్డిని ఎంత దారుణంగా ఎవరు చంపారో కడప జిల్లాలోని ప్రతి గడపకు తెలుసు నని సునీత వ్యాఖ్యానించారు. ఎంపీ అవినాశ్ రెడ్డిని అరెస్ట్ చేస్తే మరిన్ని విషయాలు బయటకు వస్తాయని జగన్ భయపడుతున్నారా? అని ప్రశ్నించారు. జగన్ ఎందుకు భయపడుతున్నారనే విషయాన్ని ప్రజలంతా అర్థం చేసుకోవాలన్నారు. దీనిపై ప్రజల్లోనూ చర్చ జరగాలని సూచించారు. అప్పుడే నిజాలు బయటకు వస్తాయని చెప్పారు.
సాక్షిలోనే మాట్లాడతా!
“మానాన్నను ఎవరు చంపారో.. ఎందుకు చంపారో.. ఎక్కడో మాట్లాడడం కాదు. నేరుగా జగనన్న సొంత ఛానెల్ సాక్షిలోనే మాట్లాడతా? నన్ను ఇంటర్వ్యూ చేసే దమ్ము ఈ మీడియాకు ఉందా? ఉంటే చెప్పండి ఇప్పుడే ఈక్షణమే సాక్షిలో అన్ని విషయాలు చెబుతా” అని సునీత సవాల్ విసిరారు. కడప ఎంపీ అభ్యర్థిగా షర్మిల పోటీ చేయబోతున్నారని తనకు తెలిసిందని… ఆమెకు శుభాకాంక్షలు తెలుపుతున్నానని సునీత చెప్పారు. షర్మిలను కలిసి సంఘీభావం తెలుపుతానని.. ఆమె కోసం ఇల్లిల్లూ తిరిగి ప్రచారం చేసేందుకు తాను త్వరలోనే కార్యాచరణ(ప్లాన్) సిద్ధం చేసుకుంటానని అన్నారు. దీనికి గాను తాను ఏ పార్టీలోనూ చేరాల్సిన అవసరం లేదన్నారు.
“వైసీపీ పునాదులు రక్తంతో తడిసిపోయాయి. అలాంటి పార్టీ నుంచి అందరూ బయటకు రావాలి. లేకపోతే ఆ పాపం మీకు కూడా చుట్టుకుంటుంది. జగనన్న పార్టీకి ఓటు వేయొద్దు. ఎన్నికల్లో వైసీపీ గెలవకూడదు. నా తండ్రిని హత్య చేసిన వారికి, చేయించిన వారికి శిక్ష పడాలి. మన ధైర్యాన్ని ఓటు ద్వారా చూపిద్దాం. వైసీపీ ప్రభుత్వాన్ని గద్దె దించుదాం” అని సునీత కడప ప్రజలకు పిలుపునిచ్చారు.
Gulte Telugu Telugu Political and Movie News Updates