రాజకీయాల్లో జంపింగులు కొత్తకాదు. పైగా ఎన్నికల సమయంలో నాయకులు కప్పదాట్లు.. గోడదూకుళ్లు కూడా సహజమే. అయితే.. చిత్రం ఏంటంటే.. జనసేనలో చేరిన రెండు వారాల్లోనే కీలకమైన నాయకుడు జంప్ చేయడం. అదేసమయంలో పవన్ పనితీరును కూడా విమర్శించడం. వాస్తవానికి పదేళ్లుగా ఉన్న నాయకులు కూడా తాజా ఎన్నికల్లో చాలా మంది టికెట్లు తెచ్చుకోలేక పోయారు. అయినప్పటికీ.. వారు పార్టీ లైన్‌ను దాటేందుకు సాహసించలేదు. కానీ, తాజాగా రెండు వారాల కిందట పార్టీలో చేరిన ప్రముఖ పారిశ్రామిక వేత్త గంటా నరహరి.. మాత్రం జంప్ చేశారు.
బలిజ సామాజిక వర్గానికి చెందిన సీమ నేత గంటా నరహరి తాజాగా సీఎం జగన్ సమక్షంలో వైసీపీలో కండువా కప్పుకొన్నారు. రెండు వారాలకే జనసేన నుంచి ఆయన బయటకు రావడం పార్టీలో చర్చనీయాంశం అయింది. “జనసేనాని పవన్‌కల్యాణ్ మాట నిలబెట్టుకోలేరని చాలా త్వరగా గ్రహించా. ఆ పార్టీలో ఉంటే రాజకీయ భవిష్యత్ నాశనం అవుతుంది. అందుకే బయటకు వచ్చా. నేను చెప్పేది ఒక్కటే పార్టీలో ఉన్నవారు ఇప్పటికైనా తెలుసుకోండి. భవిష్యత్తును నాశనం చేసుకోవద్దు” అని నరహరి వ్యాఖ్యానించారు. అయితే.. ఇప్పటికే అభ్యర్థులను పూర్తి స్థాయిలో ప్రకటించేసిన నేపథ్యంలో వైసీపీలో నూనరహరికి టికెట్ లేదు.
ఎవరీ నరహరి!
పారిశ్రామికవేత్త అయిన గంటా నరహరి దివంగత టీటీడీ చైర్మన్ డీకే ఆదికేశవులునాయుడికి సమీప బంధువు. కడప జిల్లా రాజంపేటలో బలమైన నాయకుడిగా ఎదిగారు. అయితే.. ఆయనకు సపోర్టు లేదు. ఈ నేపథ్యంలో 2022లోనే టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు. దీంతో చంద్రబాబు ఆయనను అప్పటికప్పుడే.. రాజంపేట టీడీపీ పార్లమెంటరీ అధ్యక్షుడిగా నియమించారు. అప్పట్లోనే నరహరిని రాజంపేట పార్లమెంట్ అభ్యర్థిగా చంద్రబాబు ప్రకటించారు. ఆర్థికంగా బలంగా ఉండడం.. పదిమందిలోనూ ఫీల్ గుడ్ నాయకుడిగా ఎదగడంతో ఆయన గెలుపు గుర్రం ఎక్కడం ఖాయమని కూడా అనుకున్నారు.
వైసీపీకి కంచుకోట వంటి రాజంపేటలో టీడీపీని బలోపేతం చేసేందుకు నరహరి.. బాగానే ఖర్చు చేశారని అంటారు. అయితే.. బీజేపీ, జనసేనతో పొత్తు పెట్టుకున్న తర్వాత.. టీడీపీ వ్యూహం మారిపోయింది. దీనికితోడు.. రాజంపేట టికెట్‌ను బీజేపీ కోరుతోంది. దీనికి ముందే ఈ విషయం తెలుసుకున్న నరహరి.. టీడీపీని వదిలేశారు. ఆవెంటనే ఫిబ్రవరి 11న ఆయన జనసేనే తీర్థం పుచ్చుకున్నారు. అయితే.. ఆయన వ్యూహం పొత్తులో భాగంగా జనసేన రాజంపేట తీసుకుంటే.. తాను పోటీ చేయాలని భావించారు. కానీ, జనసేన పై కూడా ఈ టికెట్ కోసం ఒత్తిడి వచ్చింది. దీంతో బీజేపీకే రాజంపేట టికెట్ వదిలేశారు. ఈ నేపథ్యంలో తిరుపతి అసెంబ్లీ టికెట్ ఇస్తానని పవన్ హామీ ఇచ్చారు.
అయితే.. ఇక్కడ కూడా నరహరికి అవకాశం దక్కలేదు. వైసీపీ నుంచి వచ్చిన చిత్తూరు ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులుకు తిరుపతి అసెంబ్లీ సీటు ఇచ్చారు. ఈ నేపథ్యంలోనే నరహరి మనస్తాపానికి గురై.. జనసేనకు గుడ్ బై చెప్పారని తెలుస్తోంది. కాగా, పార్టీలో చేరిన నరహరికి.. వైసీపీ అధినేత జగన్.. పిఠాపురంలో పనిచేయాలని బాధ్యతలు అప్పగించినట్టు సమాచారం. పిఠాపురంలో పవన్ పోటీ చేస్తున్నారు. ఈ క్రమంలోఅక్కడ ఆయనను ఓడించాలనేది జగన్ లక్ష్యం. దీంతో పవన్‌పై ఆయన పార్టీకి చెందిన నాయకుడినే ప్రయోగించడం గమనార్హం.
Gulte Telugu Telugu Political and Movie News Updates