రాష్ట్రంలోని చేనేతలకు చంద్రబాబు అదిరిపోయే హామీ ఇచ్చారు. నేతన్నలపై వరాల జల్లు కురిపించారు. ఇప్పటి వరకు ఎవరూ ఇవ్వని హామీని వారికి ఇచ్చారు. వచ్చే ఎన్నికల్లో తమ కూటమి గెలిచి అధికారంలోకి రాగానే పవర్ లూమ్స్ పెట్టుకున్న వారికి 500 యూనిట్ల వరకు విద్యుత్‌ను ఉచితంగా ఇస్తామని ప్రకటించారు. ఈ తరహా హామీ ఇప్పటి వరకు ఎవరూ ఇవ్వలేదు. కేవలం 200 యూనిట్ల వరకు మాత్రమే ఉచితంగా అమలవుతోంది. ఈ క్రమంలో చంద్రబాబు.. తాజా హామీ సంచలనంగా మారింది. ప్రజాగళం పేరుతో ఎన్నికల ప్రచారం చేస్తున్న చంద్రబాబు.. పలమనేరులో ప్రసంగించారు.
అధికారంలోకి వచ్చిన ఐదేళ్లలో 25 లక్షల ఉద్యోగాలు కల్పిస్తామని యువతకు చంద్రబాబు హామీ ఇచ్చారు. జగన్ మోసపూరిత మాటలతో ప్రజలను ఐదేళ్ల పాటు మోసం చేశారన్నారు. రాయలసీమ అభివృద్ధికి జగన్ చేసిందేమీ లేదని అన్నారు. అనంతపు రానికి నీళ్లు తీసుకొచ్చిన ఘనత టీడీపీ ప్రభుత్వానిదేనన్నారు. కియా పరిశ్రమను అనంతపురం జిల్లాలో ఏర్పాటయ్యేలా టీడీపీ ప్రభుత్వం కృషి చేసిందని తెలిపారు. రాయలసీమలో సాగునీటి ప్రాజెక్టులకు దివంగత నేత ఎన్టీఆర్ శ్రీకారం చుట్టారని, ఆ ప్రాజెక్టులను తాను మరింత అభివృద్ధి చేశానని తెలిపారు.
జగన్ సిద్ధం అంటూ మరో మెసపూరిత యాత్రకు వస్తున్నారని.. ఆయనకు ఖాళీ రోడ్లతో స్వాగతం పలకాలని సూచించారు. ఒక్కరు కూడా జగన్ పర్యటనలకు వెళ్లకుండా ఆయన పాలనను తిరస్కరించాలని పిలుపునిచ్చారు. జగన్ రాయలసీమ ద్రోహి. మీ వద్దకు రావడానికి వీలులేదని ప్రజలంతా జగన్‌కు చెప్పాలి. ఏపీని జగన్ సర్వ నాశనం చేశారు. రాష్ట్ర భవిష్యత్తు మార్చే రోజు మే13వ తేదీ కోసం ప్రజలంతా ఎదురుచూస్తున్నారు అని చంద్రబాబు అన్నారు. ఆరోజుతో రాష్ట్రానికి పట్టిన జగన్ అనే శని వదిలిపోతుందని తెలిపారు. జే బ్రాండ్ మద్యం, గంజాయి నుండి రాష్ట్రానికి విముక్తి కలిగించే రోజు మే 13 అవుతుందన్నారు.
టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి అభ్యర్థులకు ఓటు వేసి భారీ మెజార్టీతో గెలిపించి.. జగన్‌ను ఇంటికి పంపేందుకు ప్రజలు సిద్ధం గా ఉండాలని చంద్రబాబు పిలుపునిచ్చారు. రాయలవారు ఏలిన ప్రాంతాన్ని జగన్ సర్వనాశనం చేసారన్నారు. నాడు దివంగత నేత ఎన్టీఆర్ రాయలసీమను సస్యశ్యామలం చేశారన్నారు. కరువు సీమగా ఉన్న రాయలసీమలో అన్ని రంగాలను తాను సీఎంగా ఉన్నప్పుడు అభివృద్ధి చేశానని చంద్రబాబు తెలిపారు. పరదాల వీరుడు జగన్ నేడు ముసుగులతో బస్సుయాత్ర మొదలుపెట్టారని.. ప్రజలు జాగ్రత్తగా ఉండాలని చంద్రబాబు సూచించారు. ఎన్డీయే కూటమి అధికారంలోకి వస్తే కరెంటు ఛార్జీలు పెంచబోమని చంద్రబాబు హామీ ఇచ్చారు.
Gulte Telugu Telugu Political and Movie News Updates