ఏపీలోని ప్రధాన పార్టీలైన వైసీపీ, టీడీపీ అధినేతలు ప్రచారానికి సిద్ధమయ్యారు. వైసీపీ అధినేత, సీఎం జగన్మోహన్‌రెడ్డి, టీడీపీ అధినేత చంద్రబాబు బుధవారం నుంచి ప్రజల్లోకి వస్తున్నారు. సీఎం జగన్ `మేమంతా సిద్ధం` పేరుతో బస్సు యాత్రకు సిద్ధమవు తుండగా, చంద్రబాబు `ప్రజాగళం` పేరుతో ఎన్నికల పోరుకు సన్నద్ధమవుతున్నారు. ఇద్దరు నేతలు ఒకేరోజు(బుధవారం), ఒకే ముహూర్తంలో ప్రజల్లోకి వెళుతుండడంతో సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఈ రెండు పార్టీలు రానున్న ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. వచ్చే ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా వ్యూహాలు రచించాయి.
టీడీపీ, బీజేపీ, జనసేన కూటమిగా ఏర్పడిన విషయం తెలిసిందే. ఇక, వైసీపీ మరోసారి ఒంటరిగానే బరిలోకి దిగుతోంది. ఎన్నిక లకు కేడర్‌ను సన్నద్ధం చేసేందుకు ఇప్పటికే వైసీపీ సిద్ధం పేరుతో భారీగా బహిరంగ సభలను నిర్వహించింది. నాలుగు భారీ సభ లు నిర్వహించిన తరువాత వైసీపీ కాస్త గ్యాప్ ఇచ్చింది. మళ్లీ బుధవారం నుంచి సీఎం జగన్ ప్రజల్లోకి వచ్చేందుకు సిద్ధమవుతు న్నారు. ఇడుపులపాయలో బుధవారం ప్రారంభం కానున్న బస్సు యాత్ర 21 రోజులపాటు కొనసాగనుంది. జగన్ బుధవారం ఉదయం 10.56 గంటలకు తాడేపల్లి నివాసం నుంచి బయలుదేరి మధ్యాహ్ననానికి ఇడుపులపాయకు చేరుకుని రాజశేఖర్‌రెడ్డి ఘాట్ వద్ద ప్రార్థనలు చేస్తారు. అనంతరం బస్సు యాత్రను ప్రారంభిస్తారు.
టీడీపీ అధినేత చంద్రబాబు `ప్రజాగళం` పేరుతో బుధవారం నుంచి సభలు, రోడ్ షోలు నిర్వహించనున్నారు. బుధవారం నుంచి ఈ నెల 31 వరకు చంద్రబాబు వరుసగా పర్యటించనున్నారు. రోజుకు మూడు నుంచి నాలుగు నియోకజవర్గాల్లో ప్రజాగళం పేరుతో నిర్వహించనున్న యాత్రలో భాగంగా మూడు నుంచి నాలుగు నియోజకవర్గాల్లో పర్యటించనున్నారు. 27న చంద్రబాబు పలమనేరు, నగరి, నెల్లూరు రూరల్ నియోజకవర్గాల్లో ప్రచారాన్ని నిర్వహించనున్నారు. 28న రాప్తాడు, శింగనమల, కదిరి, 29న శ్రీశైలం, నందికొట్కూరు, కర్నూలు, 30న మైదుకూరు, ప్రొద్దుటూరు, సూళ్లూరుపేట, శ్రీకాళహస్తిలో ప్రచారాన్ని నిర్వహించనున్నారు.
రెండు రోజులు ఆలస్యంగా పవన్!
ఇక, జనసేన అధినేత పవన్ కల్యాణ్.. రెండు రోజుల ఆలస్యంగా ఈ నెల 30వ తేదీ నుంచి ప్రచారం ప్రారంభించనున్నారు. ఆయన పోటీ చేయనున్న పిఠాపురం నుంచి పవన్ ఎన్నికల ప్రచారం ప్రారంభించనున్నారు. మూడు రోజుల వరకు అక్కడే ప్రచారం చేసి తర్వాత మిగతా నియోజకవర్గాల్లో ప్రచారం చేస్తారు.
Gulte Telugu Telugu Political and Movie News Updates