బీజేపీ సీనియర్ నాయకుడు, రాజ్యసభ సభ్యుడు జీవీఎల్ నరసింహారావు.. తన సొంత పార్టీపై నిరసన గళం వినిపించారు. విశాఖ పట్నం పార్లమెంటు సీటును ఆశించిన ఆయనకు పార్టీ మొండి చేయి చూపింది. పైగా.. ఎక్కడో కడప నుంచి తీసుకువచ్చి.. సీఎం రమేష్ కు అనకాపల్లి సీటును అప్పగించింది. దీంతో తీవ్రంగా హర్ట్ అయిన జీవీఎల్.. నిరసన స్వరం వినిపించారు. భవిష్యత్తు కార్యాచరణను ప్రకటిస్తానని చెప్పారు. తాను విశాఖలో మూడేళ్లుగా అనేక పనులు చేస్తున్నానని చెప్పారు. అయినా కూడా తనకు టికెట్ నిరాకరించారని పేర్కొన్నారు. ఇది చాలా తనను బాధించిందన్నారు.
మూడేళ్ల నుంచి విశాఖలోనే తాను ఉన్నానని జీవీఎల్ చెప్పారు. స్థానికంగా ప్రజలకు చేరువయ్యానని, వారి సమస్యలు తెలుసుకుని పరిష్కరించుకునే ప్రయత్నం కూడా చేశానని చెప్పారు. ఆయా సమస్యలపై పోరాడానని చెప్పారు. తన పరిధిలో ఉన్న కొన్ని సమస్యలకు పరిష్కరించానని అన్నారు. తాను అందరితోనూ కలిసి మూడేళ్ల నుంచి విశాఖ అభివృద్ధి కోసం కృషి చేశానని జీవీఎల్ పేర్కొన్నారు. తాను చేసిన సేవ నిస్వార్థమైనదని.. ఇది వృథా అయిందని అన్నారు. అయినప్పటికీ.. తాను కుంగిపోవడం లేదన్నారు. వచ్చే రోజుల్లో మరింత ఎక్కువగా కష్టపడతానని చెప్పారు.
రాబోయే ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని తాను సేవ చేయలేదని జీవీఎల్ అన్నారు. ‘జీవీఎల్ ఫర్ వైజాగ్’ అనేది నిరంతర ప్రక్రియ అని.. ఇది కొనసాగుతునే ఉంటుందని ఆయన తెలిపారు. త్వరలోనే విశాఖకు వస్తానని….తన అనుచరులతో కలిసి భవిష్యత్తు కార్యాచరణపై చర్చిస్తానని చెప్పారు. బీజేపీపై తనకు వ్యతిరేకత లేదని.. అయితే, తనకు టికెట్ రాకుండా కొందరు చక్రం తిప్పారని భావిస్తున్నట్టు చెప్పారు. విశాఖలోనూ, రాష్ట్రంలో బీజేపీ జెండా రెపరెపలాడే విధంగా కార్యాచరణ రూపొందించుకుం దామని రాజ్యసభ సభ్యుడు జీవీఎల్ నరసింహరావు తన అనుచరులకు పిలుపునిచ్చారు.
Gulte Telugu Telugu Political and Movie News Updates