‘జ‌గ‌న్‌ను అధఃపాతాళానికి తొక్క‌క పోతే నా పేరు మార్చుకుంటా’

‘ఏపీ సీఎం జ‌గ‌న్‌ను అధఃపాతాళానికి తొక్క‌క‌పోతే నా పేరు మార్చుకుంటా’ అని న‌ర‌సాపురం ఎంపీ ర‌ఘురామ‌కృష్ణ రాజు సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. ప్ర‌స్తుతం ఆయ‌న‌కు ఏ పార్టీ కూడా టికెట్ ఇవ్వ‌లేదు. దీంతో కొంత ఫ్రెస్ట్రేష‌న్‌లో ఉన్న ఆయ‌న‌.. వైసీపీనే దీనికి కార‌ణ‌మ‌ని చెప్పారు. బీజేపీ త‌న‌కు టికెట్ ఇవ్వ‌కుండా.. జ‌గ‌న్ తెర‌వెనుక మంత్రాంగం న‌డిపించార‌ని ఆయ‌న వ్యాఖ్యానించారు. త‌న‌కు టికెట్ రాలేద‌నే బాధ ఉన్నా.. జ‌గ‌న్ స‌ర్వ‌నాశ‌నం అవ్వాల‌నే త‌న క‌లని కూట‌మి పార్టీలు(టీడీపీ-బీజేపీ-జ‌న‌సేన‌) నిజం చేస్తాయ‌ని, తాను కూడా వారికి స‌హ‌క‌రిస్తాన‌ని చెప్పారు.

నరసాపురం సీటు నుంచి తనకు అవకాశం దక్కకుండా సీఎం జగన్‌ అడ్డుపడ్డారని ర‌ఘురామ‌ ఆరోపించా రు. జగన్‌ షాక్‌ ఇవ్వబోతున్నారని, రఘురామకు టికెట్‌ రానివ్వరని ముందే కొందరు త‌న‌కు చెప్పారని అన్నారు. బీజేపీ తరపున సీటు దక్కకపోయినా ఎన్నికల్లో తాను ఉంటానని చెప్పారు. రాజకీయాల్లోనే ఉండి.. జగన్‌కు తగిన గుణపాఠం చెబుతానని శ‌ప‌థం చేశారు. జగన్‌ ప్రభావంతో నరసాపురం స్థానాన్ని తనకు కేటాయించలేదని, కొందరు బీజేపీ నేతలతో జగన్‌కు సన్నిహిత సంబంధాలు ఉన్న విషయం అందరికీ తెలిసిందేనన్నారు.

నరసాపురం నుంచి పోటీచేస్తానా? ఇంకేదైనా స్థానమా? అనేదానికి కాలమే సమాధానం ఇస్తుందని అన్నా రు. పనికిమాలిన వైసీపీలో చేరి ప్రజలకు అన్యాయం చేశాననే భావనతో ప్రాణాలకు తెగించి పోరాటం చేశానని పేర్కొన్నారు. తనకు సీటు దక్కకపోయినప్పటికీ జగన్‌ అనుకున్నది మాత్రం జరగనివ్వబోనని పేర్కొన్నారు. వచ్చే ఎన్నికల్లో జగన్‌ చీప్‌ ట్రిక్స్‌ పనిచేయబోవని పేర్కొన్నారు. తాను ఎన్నికల్లో పోటీ చేసినా చేయకపోయినా ఎన్డీయే విజయం సాధిస్తుందని, చంద్రబాబు అధికారంలోకి వస్తారని ఆయన దీమా వ్యక్తం చేశారు.

రానున్న రోజుల్లో ప్రజాబలం, ప్రజల అండతో ప్రతి వ్యక్తి చేత ముందడుగు వేయిస్తానని, జగన్‌ను అథఃపాతాళానికి తొక్కకపోతే తన పేరు రఘురామ కాదని శపథం చేశారు. తనకు టికెట్‌ దక్కకుండా జగన్ తాత్కాలికంగా విజయం సాధించారని, అపజయాన్ని అంగీకరిస్తున్నానని రఘురామ అన్నారు. జగన్‌ కుట్ర చేస్తారని తెలిసినా.. ఏ మూలనో ఒక నమ్మకంతో తేలికగా తీసుకున్నానని పేర్కొన్నారు. ఎంపీగా తనను అనర్హుడిని చేయాలని జగన్ ప్రయత్నించారని, జైల్లో తనను చంపేందుకు ప్రయత్నించారని రఘురామ ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు.