ఆంధ్రప్రదేశ్‌లో ప్రతిపక్ష పార్టీలను మించి అధికార పార్టీకి తలనొప్పిగా మారారు ఎంపీ రఘురామ కృష్ణంరాజు. వైసీపీ నుంచే ఎంపీగా గెలిచిన ఆయన ఏడాది తిరిగేసరికి పార్టీ రెబల్‌గా మారిపోయారు. గత కొన్ని నెలలుగా అధికార పార్టీని ఇరుకున పెట్టేలా విమర్శలు, ప్రశ్నలు, ఆరోపణలతో ఆయన చెలరేగిపోతున్నారు. వాటికి సమాధానం చెప్పలేక వైకాపా నేతలు సతమతం అయిపోతున్నారు.
తాజాగా ఆయన అమరావతి రైతుల తరఫున మాట్లాడుతూ.. అధికార పార్టీకి సవాళ్లు విసురుతున్న సంగతి తెలిసిందే. తనను రాజీనామా చేయమంటున్న వైకాపా నేతలకు బదులిస్తూ.. అమరావతి నుంచి రాజధానిని తరలించడంపై తాను రాజీనామా చేసి ఎన్నికల్లో పోటీ చేస్తానని, తాను గెలిస్తే రాజధానికి అమరావతిలోనే కొనసాగిస్తారా అని ఆయన సవాలు విసిరిన సంగతి తెలిసిందే. దీనికి మంత్రి బొత్స సత్యనారాయణ స్పందించారు. రఘురామకృష్ణరాజు రాజీనామా చేసి ఎన్నికలకు వెళ్తే వెళ్లనివ్వండని, ఆయన రాజీనామాతో పార్టీకి ఏం సంబంధం.. అదేమైనా రిఫరెండమా.. అని బొత్స సత్యనారాయణ ప్రశ్నించారు.
ఈ నేపథ్యంలో రఘురామ మరోసారి స్పందించారు. అమరావతిపై రిఫరెండంగా ఎన్నిక జరిగితే.. కనీసం లక్ష ఓట్ల మెజార్టీతో విజయం సాధిస్తానని రఘురామరాజు ధీమా వ్యక్తం చేశారు.మరోసారి ఈ విషయంలో తాను సవాల్ చేస్తున్నానని, అధికార పార్టీ నేతలు స్పందించాలని ఆయన డిమాండ్ చేశారు. సీఎం జగన్ రమ్మంటేనే తాను వైసీపీలోకి వచ్చానని, తమ మధ్య విభేదాలకు కారణం ఇతరులకు తెలియదని ఆయనన్నారు. రాజీనామాపై మంత్రి బొత్స సత్యనారాయణ లాంటి మంత్రులు ప్రకటనలు చేయడం సరికాదని ఆయనన్నారు.
Gulte Telugu Telugu Political and Movie News Updates