వైసీపీ నుంచి టికెట్ దక్కని నాయకులు ఇతర పార్టీల్లో చేరుతున్నారు. ఇలాంటి వారిలో ఎస్సీ నేతలే ఎక్కువగా ఉండడం గమనార్హం. తాజాగా ఎస్సీ నాయకుడు, గూడూరు అసెంబ్లీ నియోజకవర్గం ఎమ్మెల్యే వరప్రసాద్ బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు. ఈసారి ఎన్నికల్లో వైసీపీ అధిష్ఠానం చాలామంది సిట్టింగ్ ఎమ్మెల్యేలకు టికెట్ నిరాకరించింది. కొందరిని ఇతర నియోజకవర్గాలకు బదిలీ చేసింది.
టికెట్ దక్కని వారిలో గూడూరు ఎమ్మెల్యే వరప్రసాద్ కూడా ఉన్నారు. ఢిల్లీలో జరిగిన ఓ కార్యక్రమంలో వైసీపీ ఎమ్మెల్యే వరప్రసాద్… బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి వినోద్ ధావడే, కేంద్రమంత్రి అనురాగ్ ఠాకూర్ ల సమక్షంలో బీజేపీలో చేరారు. బీజేపీ పెద్దలు వరప్రసాద్ కు కాషాయ కండువా కప్పి సాదరంగా పార్టీలోకి ఆహ్వానం పలికారు. కాగా, ఈయనకు తిరుపతి లోక్ సభ స్థానం నుంచి ఎంపీగా పోటీ చేసే అవకాశం దక్కినట్టు తెలుస్తోంది.
ఇక, మరో ఎస్సీ నాయకుడు, చింతలపూడి(ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలోని) నియోజకవర్గం ఎమ్మెల్యే ఎలీజా.. తాజాగా కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. వైఎస్ షర్మిల నేతృత్వంలో ఆయన పార్టీలో చేరారు. ఈయనకు కూడా.. వైసీపీ ఈ దఫా టికెట్ ఇవ్వలేదు. వైసీపీ చేయించిన పలు సర్వేల్లో ఎలీజాకు మైనస్ మార్కులు వచ్చాయి. దీంతో పార్టీ అధిష్టానం ఆయనను పక్కన పెట్టింది. ఈ నేపథ్యంలో ఆయన పార్టీకి దూరమయ్యారు. ఈయనకు కాంగ్రెస్ పార్టీ చింతలపూడి నియోజకవర్గం టికెట్‌ను ఇవ్వనున్నట్టు తెలిసింది.
వైసీపీపై ఎఫెక్ట్!
ఎస్సీలకు అండగా ఉంటామని చెబుతున్న వైసీపీ.. అదే ఎస్సీ సామాజిక వర్గాలకు చెందిన నాయకులకు టికెట్ ఇవ్వకపోవడం.. సిట్టింగు నేతలను పక్కన పెట్టడం.. వారు వేరే పార్టీల్లోకి జంప్ చేస్తుండడంతో ఈ ప్రభావం ఎన్నికలపై పడుతుందని అంటున్నారు పరిశీలకులు. ఆయా నియోజకవర్గాల్లో వైసీపీ ఓటు బ్యాంకు చీలడం ఖాయమని తెలుస్తోంది. మరి వైసీపీ ఇలాంటి చర్యల ద్వారా .. ఎస్సీలకు మేలు చేస్తున్నట్టా? కీడు చేస్తున్నట్టా? అనే చర్చ జరుగుతోంది.
Gulte Telugu Telugu Political and Movie News Updates