ఏపీ సీఎం జగన్ ఓటర్లను ఆకట్టుకునేందుకు ఇప్పటికే వివిధ రూపాలను ఎంచుకున్నారు. సోషల్ మీడియాలో వైసీపీ పాటలు, ప్రసంగాలు, శపథాలు, జగన్ కామెంట్లు.. ఇలా ఒకటేమిటి.. వివిధ రూపాల్లో ప్రచారాన్ని తీవ్రస్తాయిలో చేస్తున్నారు. వీటికితోడు జగన్ ప్రభుత్వంపై సానుకూలంగా పేదల కామెంట్లతో కూడిన సమాచారాన్ని కూడా డిజిటల్ రూపంలో దంచి కొడుతున్నారు. అయితే.. ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చాక మరో రూపంలో ప్రచారాన్ని సీఎం జగన్ షురూ చేశారు.
తాజాగా సీఎం జగనే నేరుగా ఈ డిజిటల్ ప్రచారంలోకి ఎంట్రీ ఇచ్చారు. ఓటర్లను ఆకట్టుకునేందుకు బీద అరుపులతో మెసేజ్ ఫార్వర్డ్ చేస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లోని ప్రజలందరికీ జగన్ వాయిస్ తో మెసేజ్‌లు పంపుతున్నారు. గురువారం మధ్యాహ్నం నుంచి చాలా మంది ప్రజల మొబైల్ ఫోన్లకు ఈ వాయిస్ మెసేజ్‌లు వస్తున్నాయి. అవి విని ప్రజలు షాక్ అవుతున్నారు. ఇదో కొత్త ప్రచారం మొదలు పెట్టారా? అంటూ చర్చించుకోవడం గమనార్హం.
ఇదీ.. జగన్ వాయిస్..
“నాకు చంద్రబాబు లాగా 10 మంది సినిమా నటులు స్టార్ కాంపెయినర్స్ లేరు. మీడియా అండ లేనే లేదు. ఆకాశంలో నక్షత్రాల్లా మీరే స్టార్ కాంపెయినర్స్. నేను మీ బిడ్డను, అన్నను తమ్ముణ్ని. తోడుగా రావాలని ప్రజలకు పిలుపునిస్తున్నా” అని జగన్ తన వాయిస్‌తో అన్ని ఫోన్లకు మెసేజ్‌లకు పంపిస్తుండడం గమనార్హం.
టీడీపీ ఫైర్
సీఎం జగన్ వాయిస్‌తో కూడిన మెసేజ్‌లు వైరల్ అవడంతో.. విపక్ష నేతలు తీవ్రంగా స్పందిస్తున్నారు. సీఎం జగన్ పంపిన ఈ సందేశాలు ఎన్నికల కోడ్ ఉల్లంఘన కిందకే వస్తాయని, దీనిపై ఎన్నికల సంఘం చర్యలు తీసుకోవాల్సిందేనని టీడీపీ నేతలు డిమాండ్ చేస్తున్నారు. ఇదే విషయంపై ఎన్నికలకు కమిషన్‌కు ఫిర్యాదు చేసేందుకు టీడీపీ నేతలు రెడీ అయ్యారు.