చంద్ర‌బాబు-ప‌వ‌న్ కలిసారు.. ఏమి డిసైడ్ అయ్యరంటే

ఏపీలో జ‌ర‌గ‌నున్న అసెంబ్లీ, పార్ల‌మెంటు ఎన్నిక‌ల‌ను ప్ర‌తిష్టాత్మ‌కంగా తీసుకున్న టీడీపీ అధినేత చంద్ర‌బాబు, జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ల్యాణ్‌లు.. చేతులు క‌లిపిన విష‌యం తెలిసిందే. బీజేపీతో క‌లిసి ఉమ్మ‌డిగా ముందుకు సాగుతున్నారు. ఇప్ప‌టి వ‌ర‌కు టికెట్ల పంప‌కాలు పూర్త‌య్యాయి. ఇక‌, ఇప్పుడు ప్ర‌చారం, ఎన్నిక‌ల వ్యూహాల‌లో ఎలా ముందుకు సాగాల‌నే విష‌యంపైనా ఇరు పార్టీలు తాజాగా ఒక నిర్ణ‌యానికి వ‌చ్చాయి.

ఇప్పటికే టీడీపీ, జనసేన పలువురు అభ్యర్థులతో జాబితాలు ప్రకటించాయి. మిగిలిన అభ్యర్థులు, వారి స్థానాలు తదితర అంశాలపై నా ఇరువురు నాయ‌కులు చ‌ర్చించారు. తాజాగా హైద‌రాబాద్‌లో చంద్ర‌బాబు నివాసానికి వ‌చ్చిన ప‌వ‌న్ క‌ళ్యాణ్‌.. సుదీర్ఘంగా రెండు గంట‌ల పాటు ఇరువురు ప‌లు అంశాల‌పై చర్చించారు. వీలైనంత త్వరగా మిగిలిన అభ్యర్థులను ప్రకటించి, ఎన్నికల ప్రచారం మొదలుపెట్టాలని ఇరువురు నిర్ణయించారు.

ఎన్నికలకు 50 రోజుల సమయం ఉండడంతో సాధ్యమైనంత బలంగా ప్రజల్లోకి వెళ్లాలని భావిస్తున్నారు. ఈ క్రమంలో అనుసరించాల్సిన ఉమ్మడి ప్రచార వ్యూహంపై చంద్రబాబు, పవన్ సమాలోచనలు జరిపారు. మరిన్ని ప్రజాగళం సభలు నిర్వహించడంపై కూడా ఈ భేటీలో చర్చించినట్టు తెలిసింది. వారానికి ఒక ప్ర‌జాగ‌ళం స‌భ‌ను నిర్వ‌హించాల‌ని నిర్ణ‌యించారు. ఇటీవ‌ల గుంటూరు జిల్లా చిల‌క‌లూరి పేటలో నిర్వ‌హించిన ప్ర‌జాగ‌ళం స‌భ‌కు మంచి స్పంద‌న వ‌చ్చింది.

ఈ నేప‌థ్యంలో ఇలాంటి స‌భ‌ల‌ను వారానికి ఒక‌టి చొప్పున నిర్వ‌హించేలా ప్లాన్ చేశారు. ఇక‌, ఉమ్మ‌డిగా ప్ర‌చారం చేసే అంశంపైనా చంద్ర‌బాబు-ప‌వ‌న్‌లు ఒక ప్లాన్ చేసుకున్న‌ట్టు తెలిసింది. వాస్త‌వానికి పొత్తులో జ‌న‌సేన‌కు 21 స్థానాలే ఇచ్చినా.. రాష్ట్ర వ్యాప్తంగా ప‌వ‌న్ ఇమేజ్ను వినియోగించుకోవాల‌న్న‌ది చంద్ర‌బాబు వ్యూహం. ఈ క్ర‌మంలో ఒక‌వైపు జ‌న‌సేన టికెట్లు పొందిన వారి ప‌క్షాన ప్ర‌చారం చేస్తూనే మరోవైపు.. ప‌వ‌న్ రాష్ట్ర వ్యాప్తంగా ఎన్డీఏ అభ్య‌ర్థుల ప‌క్షాన కూడా ప్ర‌చారం చేయ‌నున్నారు. మొత్తంగా ఈ స‌మావేశంలో ప్ర‌చారంపై ఎక్క‌డా దృష్టి పెట్టారు.