జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అసెంబ్లీ ఎన్నికల్లో పిఠాపురం నుంచి పోటీ చేస్తున్నానని ఇటీవల ప్రకటించారు. ఈ ప్రకటన తర్వాత పవన్ కళ్యాణ్ తాను పోటీ చేస్తున్న పిఠాపురం నియోజకవర్గంలో తొలిసారి పర్యటించారు. పిఠాపురం తనకు ప్రత్యేక నియోజకవర్గం అని, ఈ ప్రాంతాన్ని తన స్వస్థలం చేసుకుంటానని, ఇక్కడే సొంతిల్లు ఏర్పాటు చేసుకుంటానని.. ఇక్కడే ఉంటానని పవన్ స్పష్టం చేశారు. రాజకీయాలకు అతీతంగా తనకు పిఠాపురం అంటే తనకు చాలా ఇష్టమన్నారు. పిఠాపురం నుంచి పోటీ చేయాలని తాను ముందు అనుకోలేదన్నారు. అయితే.. తన అభిమానులు చేసిన సూచనల మేరకు ఇక్కడ నుంచి పోటీ చేస్తున్నట్టు చెప్పారు.
పిఠాపురంలో తాజాగా జరిగిన ఓ కార్యక్రమంలో పవన్ మాట్లాడుతూ.. “2019లో పిఠాపురం నుంచి పోటీ చేయాలని కొందరు సూచించారు. అప్పట్లో ఆలోచించాను. దీనిని ఓ నియోజకవర్గంగా చూడలేదు. ఉమ్మడి నియోజకవర్గంలో కీలక స్థానం ఇది. ఇక్కడ ఉండే కొన్ని గొడవలు, కులాల విషయాలు అన్నీ చూశాను. కులాల ఐక్యత ఉంటూనే కాపు సమాజం పెద్దన్న పాత్ర పోషించాలి. ఈరోజు నా కల సాకారం కానుంది. భీమవరం, గాజువాక, పిఠాపురం నియోజకవర్గాలు నాకు 3 కళ్లు. నా గెలుపు కోసం ఆలోచించకుండా, పార్టీ కోసం ప్రజల కోసం ఆలోచిస్తుంటే.. మిమ్మల్ని అసెంబ్లీకి పంపించే బాధ్యత మేం తీసుకుంటామని పిఠాపురం నేతలు, ప్రజలు చెప్పడం చాలా సంతోషాన్ని ఇచ్చింది. పిఠాపురం నుంచే ఆంధ్రప్రదేశ్ దశా దిశ మార్చే ప్రయత్నం చేస్తా” అని పవన్ వ్యాఖ్యానించారు.
పవన్ పిఠాపురం నియోజకవర్గ పర్యటన సందర్భంగా పెద్ద ఎత్తున స్థానిక నేతలు జనసేన పార్టీలో చేరారు. పార్టీలో చేరిన వారిని పవన్ ప్రత్యేకంగా అభినందించారు. పిఠాపురం ప్రజలు తనను ఆశీర్వదించి విజయం చేకూర్చాలని పవన్ కల్యాణ్ కోరారు. ఉప్పాడలో ప్రతిసారీ రోడ్డు కోతకు గురై మత్స్యకార కుటుంబాలు ఎంత ఇబ్బంది పడుతున్నాయో తనకు తెలుసునన్నారు. దీన్ని ఏపీకి మోడల్ నియోజకవర్గంగా చేద్దామని పిలుపునిచ్చారు. ఎమ్మెల్యే అభివృద్ధి చేస్తే ఎలా ఉంటుందో చూపిద్దామన్నారు. తాను అందర్నీ కలుపుకొని వెళ్లే వ్యక్తినని, ఒక్కసారి తనతో కలిసి వస్తే ఎప్పటికీ పార్టీని వీడరని చెప్పడం గమనార్హం.