ప‌దుల సంఖ్య‌లో వ‌లంటీర్ల‌ను తొలిగింపు

ఏపీలో ఎన్నిక‌ల కోడ్ అమ‌ల్లోకి వ‌చ్చింది. ఈ సంద‌ర్భంగా వ‌లంటీర్ల వ్య‌వ‌హారం రాష్ట్ర వ్యాప్తంగా వివాదంగా మారింది. ఇప్ప‌టికే కేంద్ర ఎన్నిక‌ల సంఘం వ‌లంటీర్ల‌ను ఎన్నిక‌ల విధుల‌కు దూరంగా ఉంచాల‌ని ఆదేశాలు జారీ చేసింది. దీంతో రాష్ట్ర ప్ర‌భుత్వం ఇప్ప‌టికే వ‌లంటీర్ల‌ను దూరం పెట్టింది. అయితే.. వారితో పార్టీ కార్య‌క్ర‌మాలు చేయించుకుంటున్నారు. వారికి ఇచ్చే రెమ్యునరేష‌న్‌ను రూ.20 వేల‌కు పెంచారు. ఈ మొత్తాన్ని అభ్య‌ర్థులే ఇచ్చి.. వారితో ఈ రెండు నెల‌లు ప‌నిచేయించుకోవాల‌ని కూడా పార్టీ అన‌ధికారికంగా సూచించింది.

ఇప్పుడు వ‌లంటీర్లు ఇలానే చేస్తున్నారు. అయితే.. అనూహ్యంగా చిత్తూరు జిల్లాలో 33 మంది వ‌లంటీర్లను ప్ర‌భుత్వం రాత్రికి రాత్రే విధుల నుంచి తొల‌గించింది. ఇది ఇప్ప‌డు రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. వీరిలో చిత్తూరు కార్పొరేషన్ లో 18 మంది, పలమనేరు మున్సిపాలిటీలో 12 మంది, గుడిపాల మండపంలో ముగ్గురు ఉన్నారు. ప్రభుత్వం అప్పగించిన పనులను సక్రమంగా చేయలేదన్న కారణంగానే వీరిని తొలగించినట్టు అధికారులు చెపుతున్నారు.

అయితే.. వ‌లంటీర్ల తొల‌గింపు రాజ‌కీయంగా వివాదం సృష్టించింది. టీడీపీ స‌హా జ‌న‌సేన‌, ఇత‌ర‌ విపక్ష పార్టీల నేతలు మండిపడుతున్నారు. నిష్పక్షపాతంగా పని చేస్తున్న వాలంటీర్లను తొలగిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వైసీపీకి అనుకూలంగా వ్యవహరించని వాలంటీర్లపై కక్ష సాధింపులకు పాల్పడుతున్నారని దుయ్యబట్టారు. అయితే.. దీనిపై వైసీపీ నేత‌ల నుంచి ఎలాంటి ప్ర‌క‌ట‌నా రాలేదు. ఇదిలావుంటే.. ప్ర‌స్తుతం వలంటీర్ల వ్య‌వ‌స్థ దాదాపు ర‌ద్ద‌యిన‌ట్టేన‌ని అధికారులు చెబుతున్నారు. వ‌చ్చే నెల 1 వ తేదీన స‌చివాల‌య సిబ్బందే పింఛ‌న్లు పంపిణీ చేస్తార‌ని వెల్ల‌డించారు.