వైసీపీ ఫైర్ బ్రాండ్ నాయకురాలు, మంత్రి రోజాకు తన సొంత నియోజకవర్గం నగరిలో తీవ్ర సెగ తగులుతున్న విషయం తెలిసిందే. గత కొన్నాళ్లుగా ఆమెకు టికెట్ ఇవ్వొద్దంటూ.. ఐదు మండలాల్లోని ఒకప్పటి ఆమె అనుచరులు తీవ్ర స్థాయిలో ఉద్యమం చేస్తున్నారు. తాజాగా వీరు మరోసారి ఎలుగెత్తారు. తెల్లవారితే టికెట్ ప్రకటిస్తారని అనగా వారు మరింత రెచ్చిపోయారు. నగరి నియోజకవర్గంలోని ఐదు మండలాల నేతలు రోజాకు వ్యతిరేకంగా నిరసన ప్రదర్శనలు చేపట్టారు. అది కూడా తాడేపల్లికి ప్రత్యేక వాహనాల్లో వచ్చి.. తమ ఆవేదనను ఆందోళనను సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డికి మొరపెట్టుకున్నారు.
వచ్చే ఎన్నికల్లో రోజాకు టికెట్ ఇవ్వొద్దని సీఎం జగన్ ను వారు కోరారు. జగనన్న ముద్దు – రోజా వద్దు అని ప్లకార్డులు ప్రదర్శించారు. తాము సపోర్ట్ చేయడం వల్లే నగరి నుంచి రోజా రెండు సార్లు గెలిచారని ఆమె వ్యతిరేక వర్గీయులు అన్నారు. సొంత చరిష్మాతో రోజా గెలిచే పరిస్థితే లేదని చెప్పారు. ఆమె పేరు వింటేనే నియోజకవర్గంలోని కార్యకర్తలంతా నిరుత్సాహంతో ఉన్నారని తెలిపారు. తామంతా సపోర్ట్ చేస్తేనే రోజా గెలిచారని చెప్పారు. ఒక వేళ రోజాకు టికెట్ ఇస్తే ఆమె కచ్చితంగా ఓడిపోతారని సజ్జలకు తేల్చి చెప్పారు. తాము కూడా ఎట్టి పరిస్థితుల్లో మద్దతు ఇవ్వబోమని స్పష్టం చేశారు.
కార్యకర్తలతో రోజా చాలా చులకనగా మాట్లాడతారని విమర్శించారు. నగరి నియోజవర్గాన్ని రోజా, ఆయన సోదరులు దోచేశార ని ఆరోపించారు. తమ అనుచరులపై పోలీసులతో తప్పుడు కేసులు పెట్టించి, వారిని ఇబ్బందులకు గురి చేశారని మండిపడ్డారు. తమను జగన్ బుజ్జగించారనే వార్తల్లో ఎలాంటి నిజం లేదని చెప్పారు. రోజా వల్ల పార్టీకి ఎంతో నష్టం జరుగుతోందని అన్నారు. ఈ విషయాన్ని జగన్ గమనించాలని చెప్పారు. దీనిపై సజ్జల వారిని వారించే ప్రయత్నం చేశారు. అయినప్పటికీ.. వారు వినిపించుకోకపోవడంతో విషయాన్ని సీఎం దృష్టికి తీసుకువెళ్తామని చెప్పారు.
తెల్లవారితే జాబితా..
వచ్చే అసెంబ్లీ, పార్లమెంటు ఎన్నికలకు సంబంధించి ఈ నెల 16(శనివారం) వైసీపీ అభ్యర్థుల పూర్తి జాబితాను విడుదల చేసేం దుకు సీఎం జగన్ అన్ని ఏర్పాట్లు చేసుకున్నారు. ఆయనే స్వయంగా ఈ జాబితాను వెలువరిస్తారని పార్టీ వర్గాలు చెబుతున్నా యి. ఈ నేపథ్యంలో నగరి నియోజకవర్గం నుంచి రోజాకు టికెట్ ఇస్తారనే ప్రచారం జరుగుతోంది. దీంతో ఒక్కసారిగా ప్రత్యేక వాహనాల్లో తాడేపల్లికి వచ్చిన నగరి నియోజకవర్గం వైసీపీ కార్యకర్తలు.. రోజాకు వ్యతిరేకంగా నినాదాలు చేయడం గమనార్హం.
Gulte Telugu Telugu Political and Movie News Updates