ఉమ్మడి విశాఖపట్నం జిల్లాలో ఇపుడందరి చూపులు మాజీమంత్రి, ఎంఎల్ఏ గంటా శ్రీనివాసరావుపైనే నిలిచింది. కారణం ఏమిటంటే టీడీపీ నుంచి పోటీ చేసే అవకాశం లేకపోవటమే కారణం. ప్రతి ఎన్నికకు ఒక నియోజకవర్గాన్ని మార్చేసే అలవాటే ఇపుడు గంటాకు పెద్ద మైనస్ అయిపోయింది. స్ధిరమైన నియోజకవర్గం అంటు ఒకటి లేకపోవటంతోనే చంద్రబాబునాయుడు మాజీమంత్రిని విజయనగరం జిల్లాలోని చీపురుపల్లిలో పోటీచేయమన్నారు. అక్కడినుండి పోటీ చేయడం గంటాకు ఇష్టంలేదు. చీపురుపల్లికి వెళ్ళలేరు, విశాఖ జిల్లాలో నియోజకవర్గం లేదు. దాంతో ఏమిచేయాలనే విషయమై మద్దతుదారులతో గంటా సమావేశం నిర్వహించారు.
ఇప్పుడు సమస్య ఏమిటంటే జనసేనకు కేటాయించేసిన నాలుగు సీట్లలోను పవన్ అభ్యర్ధులను ప్రకటించేశారు. బీజేపీకి ఈ జిల్లాలో ఏమైనా సీటు కేటాయించింది లేనిది క్లారిటి లేదు. ఒకవేళ ప్రకటిస్తే అప్పుడు గంటా ఏమిచేస్తారో చూడాలి. ఇప్పటికైతే టీడీపీ తరపున జిల్లా మొత్తంమీద ఒక్కసీటును కూడా కాపులకు కేటాయించలేదు. జిల్లాలోని భీమిలి, చోడవరం, గాజువాక, అనకాపల్లి, పెందుర్తి, యలమంచిలి లో కాపుల ఓట్లు ఎక్కువగా ఉన్నాయి. ఈ విషయం తెలిసినా కూడా చంద్రబాబు ఎందుకనో ఒక్క నియోజకవర్గంలో కూడా కాపు నేతను అభ్యర్ధిగా ప్రకటించలేదు.
దాంతో ఇపుడు గంటాకు ఏమైందంటే పార్టీ మారినా పోటీ చేయటానికి ఏ నియోజకవర్గంలోనూ అవకాశం లేదు. ఎందుకంటే పొత్తు పార్టీలు అభ్యర్ధులను ప్రకటించేశాయి. పొత్తులో ప్రకటించేసిన అభ్యర్ధులతో మాట్లాడుకుని వాళ్ళని విత్ డ్రా చేయించి అక్కడి నుండి పోటీ చేయించేందకు గంటా ప్రయత్నించినా కుదరలేదట. ఇపుడు గంటా ముందున్న ఆప్షన్ ఒక్కటే. అదేమిటంటే ఇండిపెండెంటు అభ్యర్ధిగా పోటీ చేయటం లేదా పార్టీ అభ్యర్ధుల గెలుపుకు పనిచేయటం.
తన ట్రాక్ రికార్డే ఇపుడు గంట మెడకు చుట్టుకున్నది. ఒకసారి పోటీ చేసిన నియోజకవర్గంలో తాను రెండోసారి పోటీ చేయనని ఒకపుడు గంటా చాలా గర్వంగా చెప్పుకునే వారు. 2019లో విశాఖపట్నం ఉత్తరం నియోజకవర్గంలో గెలిచిన దగ్గర నుండి గంటా అసలు పార్టీలో ఉన్నారో లేదో కూడా తెలీలేదు. వైసీపీలో చేరాలని శతవిధాల ప్రయత్నించి ఫెయిలైన తర్వాతే మళ్ళీ టీడీపీలో యాక్టివ్ అయ్యారు. అందుకనే చంద్రబాబు, లోకేష్ కు గంటా అంటే మంట పెరిగిపోయింది. దాని ఫలితమే ఇపుడు పోటీకి నియోజకవర్గం లేకపోవటం. మరి చివరకు గంటా ఏమిచేస్తారో చూడాలి.
Gulte Telugu Telugu Political and Movie News Updates