తెలంగాణలో కాంగ్రెస్‌దే హ‌వా: స‌ర్వే

తెలంగాణలో జ‌ర‌గ‌నున్న పార్ల‌మెంటు ఎన్నిక‌ల్లో కాంగ్రెస్ ఏక‌ప‌క్షంగా దూసుకుపోతుందా?  రేవంత్ రెడ్డి ప్ర‌భుత్వం అమ‌లు చేస్తున్న ప‌థ‌కాల ఎఫెక్ట్ జోరుగా ప‌నిచేయ‌నుందా? అంటే.. స‌ర్వే ఔన‌నే అంటోంది. తాజాగా వెల్ల‌డైన ఏపీబీ- సీ ఓట‌రు స‌ర్వే.. సంచ‌ల‌న విష‌యాల‌ను వెల్ల‌డించింది. మొత్తం 17 పార్ల‌మెంటు స్థానాల్లో గుండుగుత్త‌గా 10 స్థానాల‌ను కాంగ్రెస్ బుట్టలో వేసుకుంటుంద‌ని స‌ర్వే తేల్చి చెప్ప‌డం గ‌మ‌నార్హం.

తెలంగాణలో ఇటీవల అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించిన కాంగ్రెస్ పార్టీ మరోసారి అదే ఊపు కొనసాగించే అవకాశం ఉంద‌ని స‌ర్వే పేర్కొంది. తెలంగాణలో ఉన్న 17 లోక్ సభ స్థానాల్లో కాంగ్రెస్ పార్టీ  10 స్థానాలు గెలుచుకుంటుందని తాజాగా నిర్వహించిన ఏబీపీ – సీ ఓటర్ ఒపీనియన్ పోల్స్ లో వెల్లడైంది. బీజేపీకి కేవ‌లం 4 స్థానాలు, బీఆర్ఎస్ పార్టీకి 2, ఎంఐఎం ఒక్క స్థానంలో గెలిచే అవకాశాలు ఉన్నాయని తేలింది.

సీట్ల షేరింగ్ ఇదీ..
కాంగ్రెస్: 10, బీజేపీ:  4, కేసీఆర్ నేతృత్వంలోని బీఆర్ఎస్ 2, ఎంఐఎం 1 స్థానం ద‌క్కించుకోనున్నారు. దీనిలో కాంగ్రెస్ పార్టీ గ‌త రెండు ఎన్నిక‌ల్లోనూ లేని విధంగా దూసుకుపోతుంద‌ని స‌ర్వే చెప్ప‌డం గ‌మ‌నార్హం. దీనికి కార‌ణం సీఎం రేవంత్ రెడ్డి డైన‌మిక్ నిర్ణ‌యాలే కార‌ణమ‌ని పేర్కొన‌డం మ‌రో కీల‌క విష‌యం.  

ఇక  ఓటింగ్ విషయంలోనూ కాంగ్రెస్ జోరుగా ముందుకు సాగుతోంది. కాంగ్రెస్ పార్టీ 42.9 శాతం ఓట్లు సాధించనుంది. బీజేపీ కన్నా బీఆర్ఎస్ కు ఎక్కువ ఓటింగ్ ఉంటుందని స‌ర్వే పేర్కొంది. 28.4 శాతం మంది ఓటర్లు బీఆర్ఎస్ కు మొగ్గు చూపుతుండ‌గా, బీజేపీకి 25.11 శాతం ఓట్లు వస్తాయని తేలింది. అయినా బీజేపీకి నాలుగు పార్లమెంట్ స్థానాలు దక్కే అవకాశం ఉంది.  

ఓట్ల షేరింగ్ ఇలా..
కాంగ్రెస్ 42.9%, బీజేపీ  25.1%, బీఆర్ఎస్  28.4% ఓట్ల షేరింగ్ ఉంటుంద‌ని స‌ర్వే తెలిపింది.