గాజువాక సీటుకు మంత్రి గుడివాడ

ఏపీ అధికార పార్టీ వైసీపీ సంచ‌ల‌న నిర్ణ‌యం తీసుకుంది. జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ళ్యాణ్ పోటీ చేయ‌బోర‌న్న వార్తల నేప‌థ్యంలో విశాఖ జిల్లా గాజువాక నియోజ‌క‌వ‌ర్గానికి మంత్రి గుడివాడ అమ‌ర్నాథ్‌ను ఇంచార్జ్‌గా నియ‌మించింది. ఈయ‌న‌కే దాదాపు టికెట్ ఇవ్వ‌నున్నారు. అసెంబ్లీ నియోజకవర్గాలకు కొత్త ఇంఛార్జిల నియామకంలో భాగంగా కొత్త జాబితాను విడుదల చేసింది. తాజా జాబితాలో ప్రస్తుత మంత్రి గుడివాడ అమర్ నాథ్ ను గాజువాక ఇంఛార్జిగా నియమించారు. ఈయనకు ఇప్పటిదాకా ఏ నియోజకవర్గం కేటాయించకపోవడంతో గుడివాడ భవిష్యత్తు ఏంటనే ఆసక్తి అందరిలో నెలకొంది.

తాజాగా ఆ ఉత్కంఠకు తెరదించుతూ గుడివాడ అమర్ కు సీఎం జగన్ గాజువాక స్థానాన్ని కేటాయించారు. వీరితో పాటు చిలకలూరి పేట అసెంబ్లీ స్థానానికి కావటి మనోహర్ నాయుడు, కర్నూలు పార్లమెంటు స్థానం ఇంఛార్జిగా బీవీ రామయ్యను నియమించారు. ఇంకా కర్నూలు మేయర్‌గా సత్యనారాయణమ్మను ఎంపిక చేశారు. ప్రస్తుతం అనకాపల్లి నుంచి గుడివాడ అమర్ నాథ్ ప్రాతినిథ్యం వహిస్తున్నారు. నియోజకవర్గ ఇంఛార్జిల ప్రక్షాళనలో భాగంగా ఆ స్థానాన్ని భరత్ కుమార్ కు కేటాయించడంతో.. గుడివాడ అమర్ ఎక్కడి నుంచి పోటీ చేస్తారనేదానిపై ఆసక్తి నెలకొంది.

అటు అధిష్ఠానం నుంచి కూడా చాలా రోజులుగా స్పష్టత లేకపోవడంతో గుడివాడ అమర్ రాజకీయ భవిష్యత్తు ఏంటనే దానిపై రకరకాల వ్యాఖ్యానాలు మొదలయ్యాయి. ఇటీవల అనకాపల్లి సభలో సీఎం జగన్ పాల్గొన్న సందర్భంగా గుడివాడ అమర్నాథ్ తనకున్న ఇబ్బందులను సీఎం ముందే వెల్లడిస్తూ… వచ్చే ఎన్నికల్లో ఎక్కడ నుంచి పోటీ చేస్తారంటూ చాలామంది తనను ప్రశ్నిస్తున్నారని గుడివాడ అమర్ ఆవేదన వ్యక్తం చేశారు. దీంతో అదే సభలో గుడివాడ అమర్ కు సీఎం జగన్ స్పష్టమైన హామీ ఇచ్చారు.

భరత్, అమర్ ఇద్దరు తన తమ్ముళ్ళే అని.. వచ్చే ఎన్నికల్లో మంత్రి అమర్నాథ్ ని తన గుండెల్లో పెట్టుకుంటానని సీఎం భరోసా ఇచ్చారు. తాజాగా అమర్ ను గాజువాక ఇంఛార్జిగా నియమించారు. అయితే.. నిన్న మొన్న‌టి వ‌ర‌కుఇక్క‌డ నుంచి ప‌వ‌న్ క‌ళ్యాణ్ పోటీ చేస్తార‌ని అంద‌రూ అనుకున్నారు. అందుకే.. ఈ విష‌యంలో వైసీపీ ఆచితూచి వ్య‌వ‌హ‌రించింది. అయితే.. తాజాగా ప‌వ‌న్ తిరుప‌తి లేదా భీమ‌వ‌రం నుంచి పోటీ చేయాల‌ని భావిస్తున్నారు. దీంతో వైసీపీ తాజాగా నిర్ణ‌యం ప్ర‌క‌టిస్తూ.. గుడివాడ‌కు పెద్ద‌పీట వేసింది.