ఆమె ట్రోల్స్‌కు భయపడే చనిపోయిందా?

ఆంధ్రప్రదేశ్‌లో ఎన్నికలు సమీపిస్తుండగా.. ప్రధాన రాజకీయ పార్టీల మధ్య విమర్శలు ప్రతి విమర్శలు.. ఆరోపణలు ప్రత్యారోపణలు తార స్థాయికి చేరుతున్నాయి. ప్రత్యర్థులను దెబ్బ కొట్టడానికి ఏ చిన్న అవకాశం వచ్చినా వదిలి పెట్టట్లేదు పార్టీలు.

ఈ క్రమంలో సోషల్ మీడియా వేదికగా రోజుకో వివాదం ముసురుకుంటోంది. ప్రస్తుతం గీతాంజలి అనే గుంటూరు మహిళ మరణానికి చెందిన వివాదం హాట్ టాపిక్‌గా మారింది. కొన్ని రోజుల కిందట ఈ మహిళ వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అయింది.

జగన్ ప్రభుత్వం ఇచ్చిన ఇంటి పట్టాను అందుకుని ఆమె ఆనందంతో మురిసిపోయింది. తనకు ఐదేళ్లుగా అమ్మఒడి వస్తోందని.. ఒక ఏడాది ఆ డబ్బుల్ని ఫిక్స్డ్‌ డిపాజిట్ కూడా చేశానని.. తన కుటుంబ సభ్యులకు రకరకాల ప్రభుత్వ పథకాలు అందుతున్నాయని ఆమె అమితానందంతో చెప్పింది. ఐతే ఈ వీడియోలో చెప్పిన విషయాల మీద సందేహాలు వ్యక్తం చేస్తూ.. ఆమెను పెయిడ్ ఆర్టిస్టుగా పేర్కొంటూ టీడీపీ, జనసేన సోషల్ మీడియా మద్దతుదారులు తనను ట్రోల్ చేశారు.

కట్ చేస్తే నాలుగు రోజులు తిరిగేసరికి గీతాంజలి అనూహ్య పరిస్థితుల్లో ప్రాణాలు కోల్పోయింది. టీడీపీ, జనసేన వాళ్ల ట్రోల్స్‌కు తట్టుకోలేక రైలు కింద పడి గీతాంజలి ఆత్మహత్యకు పాల్పడిందంటూ అధికార పార్టీ నిన్నట్నుంచి జోరుగా ప్రచారం చేస్తోంది. ఒక రోజు తిరిగేసరికి ఈ ప్రచారాన్ని పతాక స్థాయికి తీసుకెళ్లింది వైసీపీ. ప్రస్తుతం వైసీపీ సోషల్ మీడియా టీమ్స్ అన్నీ దీని మీదే ఫోకస్ పెట్టాయి.

‘జస్టిస్ ఫర్ గీతాంజలి’ అనే హ్యాష్ ట్యాగ్ కూడా ట్రెండ్ చేస్తున్నారు. ఐతే గీతాంజలి మరణం విషయంలో టీడీపీ, జనసేన వర్గాలు సందేహాలు వ్యక్తం చేస్తున్నాయి. గీతాంజలి ఆత్మహత్యకు పాల్పడలేదని.. ఈ నెల 7న రైలు ప్రమాదానికి గురై ఆసుపత్రి పాలైందని పేర్కొంటూ దీనికి సంబంధించిన ఆధారాలను పోస్ట్ చేస్తున్నారు.

ఆమెకు ప్రమాదం జరిగే సమయానికి అసలు ట్రోలింగే మొదలు కాలేదని.. దీన్ని వైసీపీ తమకు అనుకూలంగా వాడుకుంటోందని.. సోషల్ మీడియాలో ట్రోల్స్ జరిగాయని ఇద్దరు పిల్లలున్న ఓ గ్రామీణ మహిళ ఆత్మహత్యకు పాల్పడుతుందా అని వారు ప్రశ్నిస్తున్నారు. మరి ఈ వ్యవహారంలో ఎవరి వాదన కరెక్టో?