జాతీయ స్థాయిలో రాజకీయ పార్టీని ఏర్పాటు చేసి.. మోడీ వ్యతిరేకుల్ని ఒక తాటి మీదకు తెచ్చేందుకు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ పెద్ద ఎత్తున ప్రయత్నాలు చేస్తున్నట్లుగా వార్తలు రావటం తెలిసిందే.
తాను జాతీయ పార్టీ పెట్టే ఉద్దేశం లేదని.. ఒకవేళ అలాంటిది ఉంటే పార్టీ నేతలకు తొలుత చెబుతానన్న కేసీఆర్.. తాజాగా తన ఎంపీలతో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా మోడీ సర్కారును ఉద్దేశించి కీలక వ్యాఖ్యలు చేయటం గమనార్హం.
కేంద్రంతో ఎంత మంచిగా ఉంటే.. రాష్ట్రానికి అంత మేలు జరుగుతుందన్న ఉద్దేశంతో కేంద్రంలోని మోడీ సర్కారుకు ఎన్నో బిల్లుల్లో సహకరించామని.. అయినా వారు మొండిచేయి చూపుతున్నారంటూ ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. కేంద్రం తీరును పార్లమెంటులోనూ.. బయటా నిలదీయాలని.. ఆందోళనలు చేయాలని.. మాయ మాటలతో అబద్ధాలు చెప్పటాన్ని ప్రశ్నించాలని ఎంపీలకు దిశానిర్దేశం చేశారు కేసీఆర్.
మరో మూడు రోజుల్లో పార్లమెంటు సమావేశాలు షురూ కానున్న నేపథ్యంలో.. పార్లమెంటు ఉభయసభల్లో ఎలా వ్యవహరించాలన్న దానిపై క్లారిటీ ఇచ్చేశారు.దాదాపు నాలుగు గంటల పాటు టీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ భేటీ సాగింది. పెద్దనోట్ల రద్దు.. జీఎస్టీ అమలు.. ఇతర సందర్భాల్లో పలువురి విమర్శల్ని ఎదుర్కొని మరీ మోడీ సర్కారుకు అండగా నిలిచిన విషయాన్ని గుర్తు చేశారు. అయినప్పటికీ తెలంగాణ రాష్ట్రం విషయంలో కేంద్రం వైఖరి సరిగా లేదని ఆయన ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు.
తెలంగాణ కోసం ఏమీ చేయకపోగా.. రాష్ట్రానికి వస్తున్న కేంద్రమంత్రులు భిన్నంగా మాట్లాడుతున్నారని ధ్వజమెత్తారు. కేంద్రం అనుసరిస్తున్న తీరుపై తీవ్ర అసంతృప్తితో ఉన్న కేసీఆర్.. ఏ దశలోనూ రాష్ట్రానికి కేంద్రం సహకరించటం లేదన్నారు. రాష్ట్ర సమస్యల పరిష్కారంపై కేంద్రం సానుకూలంగా.. వేగంగా రియాక్టు కావటం లేదన్ నవిషయాన్ని ఎంపీలు కేసీఆర్ దృష్టికి తీసుకురాగా.. ఆయన సైతం అవునని వ్యాఖ్యానించారు.
రాష్ట్రానికి రావాల్సిన దాదాపు రూ.8-9వేల కోట్ల పెండింగ్ నిధుల్ని విడుదల చేయట్లేదన్న కేసీఆర్.. అంతర్రాష్ట జల వివాదాల పరిష్కారానికి తాను చొరవ తీసుకుంటే కేంద్రం స్పందించకపోవటాన్ని తప్పు పట్టారు. కేంద్రానికి రాష్ట్రం పెట్టుకున్న పిటిషన్ కే దిక్కులేకపోతే సామాన్యుల పరిస్థితి ఏమిటి? అంటూ కేసీఆర్ మండిపడ్డారు. మోడీ సర్కారు తీరును నిలదీయాలని గులాబీ బాస్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన నేపథ్యంలో రాజకీయం మరింత హాట్ హాట్ గా మారుతుందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.